మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి జ్వాలలు | Dissatisfied with the cabinet composition, flame | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి జ్వాలలు

Published Mon, Jun 9 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి జ్వాలలు

మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తి జ్వాలలు

  • కాగిత వర్గీయుల ఆగ్రహం
  •  సీనియర్లపై చిన్నచూపు
  •  పదేళ్లు నిరీక్షించినా ఫలితం దక్కలేదని ఆవేదన
  • సాక్షి, విజయవాడ : చంద్రబాబునాయుడు మంత్రివర్గ కూర్పుపై తెలుగుదేశం జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో ఆ ఉత్సాహం కనపడటం లేదు. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడంతో చాలా మంది సీనియర్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

    వారిని పక్కన పెట్టి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారికి మంత్రి పదవులు ఇవ్వడంపై సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలిచినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న జిల్లా పార్టీలో మంత్రి పదవుల కేటాయింపుపై వ్యతిరేకత నేపథ్యంలో మరిన్ని గ్రూపులు పెరిగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
     
    దేవినేని ఉమాకు ఓకే!
     
    జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావుకు మంత్రి పదవి దక్కుతుందని తొలి నుంచి అందరూ భావించారు. పార్టీ కష్టకాలంలో ఉండగా ఉమా పార్టీకి అండగా ఉన్నారని, దీనికి తోడు ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, అందువల్ల ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఆయన మంత్రిగా రాష్ట్ర బాధ్యతలు చేపడుతున్నందున జిల్లా అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పచెబితే బాగుంటుందని ఆ పార్టీకి చెందిన ఒక కీలక మహిళా నేత వ్యాఖ్యానించడం గమనార్హం.
     
    మండిపడుతున్న కాగిత వర్గం...
     
    జిల్లా టీడీపీలో మరో సీనియర్ నేత కాగిత వెంకట్రావ్‌కు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించారు. మంత్రి వర్గ కూర్పులో ఆయనకు మొండిచెయ్యి చూపించడంతో ఆయన అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ నిరసనను బహిరంగంగానే తెలియజేస్తున్నారు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన కాగిత వెంకట్రావ్ గతంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. అప్పట్లోనే కేబినెట్ మంత్రి పదవి వస్తుందని భావించారు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఆయన్ను పక్కనపెట్టడంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసిన కాగిత వంటి వారినే పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో సాధారణ నేతలకు ఏమి గుర్తింపు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
     
    ‘కాపు’ కాసినా పట్టించుకోరా?
     
    ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఒక బలమైన సామాజిక వర్గం ‘కాపు’ కాయడం వల్లనే పది సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో బెర్త్ దొరుకుతుందని ఆయన వర్గీయులు భావించారు. అయితే జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని పట్టించుకోకపోవడంపై ఆ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు ఇప్పటికి ఇప్పుడు ప్రశ్నించకపోయినా అవకాశం వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement