సీఎం, మంత్రుల మధ్య వివాదాలు
నిన్న కన్నా.. నేడు బాలరాజు
విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్నాటకమనే విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీర్మానం అనంతరం ఆ పార్టీ నేతల మధ్య రోజుకో రకమైన వివాదం తెరపైకి వస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణల సంబంధిత వివాదం తెరమీదకు రాగా, తాజాగా గిరిజనశాఖ మంత్రి పి.బాలరాజు సీఎం తీరుపై అసమ్మతి జెండాఎత్తారు. విశాఖలో శుక్రవారం సీఎం రచ్చబండ కార్యక్రమానికి సమాచారం, ఆహ్వానం లేని కారణంగానే బాలరాజు గైర్హాజరయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గిరిజన వర్గానికి చెందినందునే మంత్రి పట్ల ఇలా చిన్నచూపు చూస్తున్నారని బాలరాజు వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం మంత్రికి ఆహ్వానం పంపామని చెబుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య వాదోపవాదాలకు దారితీసి వాతావరణాన్ని వేడెక్కించింది. ఇదే అదనుగా సీఎం వ్యతిరేకవర్గం ఆయనపై ధ్వజమెత్తింది. తెలంగాణ నేతలైతే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు సీఎం తీరును దుయ్యబట్టారు. మంత్రిని ఆహ్వానించకపోవడమంటే అవమానించడమేనని, సీఎంపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాలని పొన్నం డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన సత్తాను బడుగు బలహీనవర్గాలపై కాకుండా ఢిల్లీపై చూపించాలని షబ్బీర్ అలీ సూచించారు. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ అంతర్నాటకంలో భాగమేనన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన పై కేంద్రం చురుగ్గా అడుగులు కదుపుతున్న సమయంలో సీమాంధ్రలో ప్రజల దృష్టిని మరల్చేలా కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఈ అంతర్నాటకానికి తెరతీస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన ప్రక్రియలో కీలకమైన.. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాక, దానిపై చర్చ, పార్లమెంటులో ఆ బిల్లుకు ఆమోదం వంటి ముఖ్య ఘట్టాలు ముందున్న నేపథ్యంలో సమైక్య ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. ఈ సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వివాదాలు తెరపైకి తెస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసమ్మతి డ్రామా!
Published Sat, Nov 16 2013 2:39 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement