జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Published Mon, Oct 7 2013 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ :జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం ఎంపీ హర్షకుమార్ కొడుకు ఎన్‌జీవోపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ నేతలు కన్నెర్ర చేశారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ భీష్మించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యాలయం ముందు నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. డీసీసీ కార్యాలయం ఎదుట ఆదివారం జేఏసీ నేతలు బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టౌన్ సీఐ మూర్తి బలగాలతో అక్కడకు చేరుకుని జేఏసీ నాయకులతో చర్చించారు.
పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయటం చట్ట విరుద్ధమని చెప్పినా నేతలు వినలేదు. ఎంపీ తనయుడు ఎన్‌జీవోస్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కార్యాలయంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో పోలీసులకు, జేఏసీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో కార్యాలయం ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బొత్సా ఫ్లెక్సీపై రాళ్లు, కోడిగుడ్ల వర్షం పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహావేశాలకు గురైన జేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఉన్న బొత్స ఫ్లెక్సీపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.
అయితే పోలీసులు జేఏసీ చర్యలను అడ్డుకున్నారు. కొంతమంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఇతరులు వారిని అడ్డుకున్నారు. కార్యాలయం ఎదుట భైఠాయించి హర్షకుమార్, బొత్సలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తున్న పోలీసుల నిరంకుశత్వ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో టౌన్ సీఐ కాంగ్రెస్ నాయకుడు మేకల కుమార్‌బాబును అక్కడికి పిలిపించారు.
చంద్రబాబు ఫ్లెక్సీలను తొలగిస్తే మా ఫ్లెక్సీలు తొలగిస్తాం
కుమార్‌బాబు కార్యాలయం వద్ద చేరుకుని జేఏసీ నాయకులతో చర్చించారు. సోనియాగాంధీ నిర్ణయం ముమ్మాటికీ తప్పుగానే పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సమైక్యవాదో, తెలంగాణకు మద్దతుదారుడో ఈనాటికీ స్పష్టంగా తేల్చి చెప్పలేదని, పట్టణంలో ఆయన ఫొటోలను తొలగిస్తే బొత్సా ఫ్లెక్సీని తొలగించేందుకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. తామంతా సమైక్యవాదానికే పూర్తిగా కట్టుబడి ఉన్నామని, జేఏసీ చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
దీంతో జేఏసీ నాయకులు కుమార్‌బాబుతో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేయించి ఆందోళనను విరమించారు. జేఏసీ నాయకులు దారపు శ్రీనివాస్, పి. వెంకటేశ్వరరావు, టి. రవీంద్ర, సీహెచ్. లక్ష్మీశ్రీనివాస్, సీహెచ్. చంద్రపాల్, పి.వి. ఫణికుమార్, తస్లీంబేగ్, ఎం. సత్యనారాయణ, ఆకూరి శ్రీనివాస్, ప్రదీప్ కుమార్‌సింగ్, డి. విజయ్‌కుమార్, కె.వి. సుబ్రహ్మణ్యం, శోభన్‌బాబు, ముదిగొండ తేజశ్రీ, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement