టీ ఇచ్చినా టెన్షన్
కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ప్రజా వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు కోరుకున్న విధంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం.. తెలంగాణలో ఇక మాకు తిరుగేలేదు. మా గెలుపునకు అడ్డే ఉండదు. ఎన్నికల్లో మమ్మల్ని సమర్థంగా ఎదుర్కొనేవారే లేరు’ అని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలకు క్షేత్ర స్థారుులో చుక్కలు కనపడుతున్నాయి. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నాయకులకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు పైకి చెప్తున్నా.. లోపల మాత్రం వారిని ఆందోళన వెంటాడుతోంది. గత ఐదేళ్లుగా రాష్ర్టంలో ప్రభుత్వ పథకాలు పడకేయడం. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపై నడిపించే ప్రజా నాయకుడు లేకపోవడం, టీఆర్‌ఎస్ కూడా కలసిరాకపోవడంతో కాంగ్రెస్ పెద్దలకు దిక్కుతోచడం లేదు. మూడురకాల ఎన్నికలు ఒకేసారి రావడంతో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి మరింత అయోమయంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ విషయూలన్నీ పార్టీ పెద్దలు గుర్తించారు. సిట్టింగ్‌లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, సగం వుంది వుళ్లీ గెలిచే పరిస్థితి లేదంటూ కేంద్ర పార్టీకి టీపీసీసీ సమాచారాన్ని చేరవేసింది. ఈ కారణంగా కొంత మంది సిట్టింగ్‌లకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని కూడా సూచించింది. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిపాలన పడక
తెలంగాణ అంశాన్ని అడ్డు పెట్టుకుని గత ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను పట్టించుకోలేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుపరిచిన అనేక పథకాలను గాలికొదిలేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతి అలా ఉంటే... అప్పటివరకు కొనసాగుతున్న పథకాలనూ సమర్థవంతంగా అమలు చేయలేకపోయారు. మరోపక్క ధరలు పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు వంటి బయటి వస్తువులే కాదు.. విద్యుత్, గ్యాస్, ఎరువులు వంటి ప్రభుత్వ పరిధిలో సరఫరా అయ్యే వాటి ధరలను కూడా భారీగా పెంచేశారు. ఏతా వాత సామాన్యుడి బతుకు భారంగా మారింది. ఈ ప్రభావం ఎన్నికల కోసం జనాల్లోకి వెళుతున్న నాయకులపై తీవ్రంగా పడుతున్నది.
ప్రజల్నిలా పీడించారు...
-వైఎస్సార్ ఉన్న ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లుల్లో ఒక్క రూపాయి పెరగలేదు. పైగా పేద రైతులపై కరెంటు భారం ఉండకూడదన్న ఉద్దేశంతో ‘ఉచిత కరెంటు’ పథకాన్ని ప్రారంభించిన వైఎస్ దాన్ని నిరాటంకంగా కొనసాగించారు. వైఎస్ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌లు ప్రతి ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. ఉచిత విద్యుత్ పథకానికి పరిమితులు విధించారు. రెగ్యులర్, సర్దుబాటు చార్జీల రూపంలో గత ఐదేళ్లల్లో రూ.33,598 కోట్ల భారాన్ని మోపారు.
-గడచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1990 కోట్ల మేర ఆర్టీసీ చార్జీలను పెంచారు. ఇక ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ను భారీగా పెంచారు. 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవాటిని 14.5 శాతం పరిధిలోకి తెచ్చారు. నాలుగేళ్లలో ప్రజల నుంచి ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా అదనంగా పిండుకుంది.
-వాహన కొనుగోలుదారులనూ ప్రభుత్వం వదలలేదు. త్రై మాసిక పన్నుల జాబితాలో ఉన్న పలు వాహనాలను జీవితపన్ను పరిధిలోకి తెచ్చారు. పన్నులు పెంచడం, రెండో వాహనం కొంటే గరిష్టంగా 14.5 శాతం పన్ను విధించడం.. తదితర చర్యలతో ప్రజలపై భారం పెంచేశారు. ఈ ఏడాది ఈ రూపేణా రూ.4,351 కోట్ల భారం పడుతున్నది.
-స్థిరాస్తి కొనుగోలును కూడా సర్కారు భారంగా మార్చింది. 29 విభాగాలుగా ఉన్న భూములు, స్థలాలను కేవలం ఐదు కేటగిరీలుగా మార్చింది. పట్టణాల్లో అయితే వాణిజ్య, నివాస అనే రెండు వర్గీకరణలకే పరిమితం చేసింది. అప్పట్లో కొన్నిచోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలను 400 నుంచి 600 శాతం వరకూ పెంచింది.
-నగరపాలక, పురపాలక సంఘాల్లో గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ.800 కోట్లు, మంచినీటిపై రూ.200 కోట్ల భారాన్ని మోపింది. భవన నిర్మాణ అనుమతి ఫీజుల పేరిట రూ.300 కోట్లను వసూలు par చేస్తున్నారు.ఙ-వైఎస్ ఉన్న సమయంలో రూ.400 ఉన్న డీఏపీ ఎరువు బస్తా నేడు రూ.1,200 కి పెరిగిందంటే ధరల పెరుగుదల తీవ్రతను అంచనా వెయ్చొచ్చు. అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా 120 శాతం పెరిగాయి.
పథకాలన్నిటినీ నీరుగార్చారు..!
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించ లేకపోయినా ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేకపోయింది. పథకాల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులే అంచనా వేస్తున్నారు. పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ విద్యుత్ సరఫరా సరిగా లేదు. ఆరోగ్యశ్రీని గాలికొదిలేశారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ను పరిమితం చేశారు. కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. రంగులు, నూలు ధరలు పెరిగి చేనేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టారు. ఈ విషయంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సైతం మౌనంగా ఉండడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణ మయింది. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను అన్న ముఖ్యమంత్రి వాఖ్యలను సైతం ఖండించలేని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొనక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘నతాఖా’పై నిర్లక్ష్యం..!
సౌదీ అరేబియూ నూతన కార్మిక చట్టం నతాఖా కారణంగా వేలాది మంది తెలుగువారు ఉపాధి కోల్పోయి భయం గుప్పిట్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేకుండా పోయింది. నతాఖా భయంతో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అక్కడి రాష్ట్రవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. నతాఖా గడువు ముగియడంతో ఎగ్జిట్ పర్మిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకసారి అరెస్ట్ జరిగి జైళ్లకు వెళితే జడ్జిమెంట్ వచ్చేంతవరకు అందులోనే మగ్గవల్సి ఉంటుందని ఇక్కడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఏడు మాసాలు గడువు ఇచ్చినప్పటికీ మన ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోని కారణంగా జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఊహించని దెబ్బ..!
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. టీఆర్‌ఎస్ విలీనం లేదా ఆ పార్టీతో పొత్తు ఉంటుందని భావించిన కాంగ్రెస్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కనీసం పొత్తు పరిస్థితి కూడా లేకపోవడంతో నేతలకు చెమటలు పడుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లో కాస్త సానుకూల స్పందన ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక పాలన ఆగ్రహం నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జంకుతున్నారు.
నడిపించే నాథుడేడీ..!
అన్నీ అలా ఉంచితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడు. పేరుకు చాలా మంది నాయకులు ఉన్నా...అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపై ఎన్నికల్లో గెలుపు దిశగా నడిపించే సమర్థుడు లేకపోవడం ప్రధాన కొరతగా తయూరరుు్యంది. పలువురు నేతలు ఎక్కడికక్కడ తమ పరిధికే పరిమితం అవుతున్నారు.