కడలి కూడెట్టట్లేదయ్యా.. | District Deputy Director D Govindaiah vip Reporter | Sakshi
Sakshi News home page

కడలి కూడెట్టట్లేదయ్యా..

Published Sun, Dec 21 2014 12:59 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

కడలి కూడెట్టట్లేదయ్యా.. - Sakshi

కడలి కూడెట్టట్లేదయ్యా..

‘నడి సంద్రంలో పొద్దగూకలా కట్టపడ్డా తిండికి కూడా కట్టమైపోతోంది సారు. సంద్రంలో సంపద మొత్తం పోనాది.

 ‘నడి సంద్రంలో పొద్దగూకలా కట్టపడ్డా తిండికి కూడా కట్టమైపోతోంది సారు. సంద్రంలో సంపద మొత్తం పోనాది. పోయినేడాది ఏటకు ఎలితే పెట్టుబడులు తీసేస్తే పది, పదిహేనేలు కన్పించేయి. పొద్దుగాలం కొట్టుకున్నా ఒడ్డుకు వచ్చాక నాలుగు డబ్బులు కూడా చేతిలో ఉండటం లేదు. ఏట మానేసుకుని పనుల్లోకి పోతున్నామయ్యా. సముద్రం ఒడ్డుల్లో పరిశ్రమలు వచ్చేసి ఆయిల్లు వదిలేత్తన్నారు. దానొల్ల సంపద సచ్చిపోతాంది సారూ.. ఏట లేకుండా మాము బతకలేం. సముద్రంలోకి ఏట కెళితే చేపలు అగుపించడం లేదు. ఏమి చేత్తాము చెప్పండి సారూ.
 
 మీరే ఏదైనా చూడాలి సారూ’ ఇదీ గంగపుత్రుల గోడు. కడలిని నమ్ముకున్న మత్స్యకారుల కడగండ్లను వెలుగులోకి తేవాలనుకున్న ‘సాక్షి’ ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందిగా మత్స్యశాఖ జిల్లా డిప్యూటీ డెరైక్టర్ డి.గోవిందయ్యను కోరింది. దాంతో ఆయన శనివారం వీఐపీ రిపోర్టర్‌గా కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగ పరిసరాల్లో మత్స్యకారులతో మాట్లాడారు. ఎప్పుడూ తమకు సలహాలు ఇచ్చే అధికారి ‘సాక్షి’ మైకు పట్టుకుని రావడాన్ని చూసి మత్స్యకారులు కళ్లింత చేసుకున్నారు. ‘ఈ రోజు మీ సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ముందుకు వచ్చాను. మొహమాటం లేకుండా అన్ని వివరంగా చెప్పండి. పరిశీలించి మీకు న్యాయం చేస్తాను’ అంటూ వారి వెతలను ఆరా తీశారు. ఆ వివరాలు ఇవి..            
 
 మత్స్యకారులకు అండగా ఉంటా..
 జిల్లాలో 99 మత్స్యకార గ్రామాల్లో వేల మంది మత్స్యకారులు సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. డీజిల్ సబ్సిడీ చాలా పెండింగ్‌లో ఉందని మత్స్యకారులు, వారి ప్రతినిధులు చెప్పారు. పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. 2002 ఏప్రిల్ వరకూ నమోదైన బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ వర్తిస్తోందంటున్నారు. తర్వాత రిజిస్టరైన బోట్లకు కూడా డీజిల్ సబ్సిడీ అందించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించి మత్స్యకారులకు, బోట్ల యజమానులకు అండగా ఉంటాను. చేపల వేట నిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తాం. ఆ కాలంలో ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఉప్పాడలో రూ.80 లక్షలు, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెంలో రూ.18 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
 
 డిప్యూటీ డెరైక్టర్ గోవిందయ్య : ఏమయ్యా! నీ పేరేమిటీ? వలల పని ఎలా ఉంది?
 మత్స్యకారుడు : నూకరాజండీ. వలల రిపేరు చేస్తుంటాను.
 డీడీ : పాతవి బాగు చేస్తారా? ఆదాయం బాగుంటుందా?
 
 నూకరాజు : ఏదో గడిచిపోతోంది సారూ!
 డీడీ (బకింగ్‌హామ్‌కెనాల్‌లో బోట్లపై ఉన్న వారితో : ఏం బాబూ...నీ పేరేమిటీ?  వేట ఎలా  సాగుతోంది?
 మత్స్యకారుడు : కోలా నాగేశ్వరరావండి. రెండు, మూడు నెలల నుంచి తీవ్రంగా నష్టపోతున్నామండి. చేపలు పడడం లేదు.
 డీడీ : కారణం ఏమిటో వివరంగా చెప్పయ్యా.
 నాగేశ్వరరావు : ఏమో తెలియదు సారూ.
 డీడీ : ఏం బాబూ. నీ పరిస్థితి ఏమిటీ? ఎందుకు చేపలు పడటం లేదు?
 మత్స్యకారుడు : గేదెల సత్తిబాబు సారూ. చేపలు పడక చాలా బాధగా ఉంటోంది. మాది పూటగడవని పరిస్థితి.
 డీడీ : నెలకు నీకు ఎంత వస్తుంది?
 సత్తిబాబు : మాకు నూటికి రూ.10 ఇస్తారండి. చేపలు పడక సముద్రంలోకి వెళ్లి తిరిగొచ్చేస్తున్నామయ్యా. కుటుంబ పరిస్థితి చాలా కట్టంగా ఉందయ్యా.
 డీడీ : బోటుకు సర్టిఫికెట్, మీరు గుర్తింపు కార్డులు తీసుకున్నారా?
 సత్తిబాబు : అన్నీ తీసుకున్నామండీ. మా దగ్గరే పెట్టుకుంటున్నాం.
 డీడీ : ఏమయ్యా.. నీ పేరేమిటి? ఏం చేస్తుంటావు? వీహెచ్‌ఎఫ్ సెట్‌లు వాడుతున్నారా?
 మత్స్యకారుడు : సీహెచ్ సత్తిబాబండి. బోటు మీద వేటకు వెళ్తుంటాను. వీహెచ్‌ఎఫ్ సెట్ వాడుతున్నామండి.
 డీడీ : ఏ ఛానల్‌లో ఉంటున్నారు? పోలీస్ ఛానల్‌కు వెళ్లకూడదు తెలుసా?
 సత్తిబాబు : మేము 14, 15, 16 ఛానల్స్‌లో మాత్రమే ఉంటున్నాం సారూ.
 డీడీ : తీరంలో టవర్ కట్టాం కదా. సముద్రంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సెట్ వాడుకోండి.
 సత్తిబాబు : అదే వాడుకుంటున్నాం. కాని ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల చేపలు పడడం లేదండి.
 డీడీ : అయినా నష్టపరిహారంగా రూ.కోట్లు ఇస్తున్నారు కదా.
 సత్తిబాబు : మాకేమీ అందడం లేదండి. మేము ఏ రోజు వేటాడిన డబ్బు ఆరోజే తెచ్చుకుంటున్నాం. చేపలు పడకపోతే పస్తులుంటున్నాం. మాకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయండి సారూ.
 డీడీ : చేపల వేట నిషేధాన్ని మీరు పాటించి ఉంటే ఇప్పుడు చేపలు లభించేవి. మీరు చేసిన తప్పిదమే అది.
 సత్తిబాబు : మేము కాదండీ. ఇతర ప్రాంతాల మత్స్యకారులు బ్యాన్ పీరియడ్‌లో చేపలు వేటాడేసుకున్నారు. ముందు వారిని ఆపాలి సారూ..
 డీడీ : ఏమండీ... మత్స్యకార నాయకుడుగారూ! మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా?
 మత్స్యకార నాయకుడు మాతరాజు : బ్యాన్ పీరియడ్‌ను సక్రమంగా అమలు చేయడం లేదు సారూ..
 డీడీ : చాలామంది మత్స్యకారుల్లో అవగాహన లేక బ్యాన్ పీరియడ్‌లో వేటకు వెళ్లిపోతున్నారు.
 మాతరాజు : మీరేమైనా చర్యలు చేపట్టాలి కదా, మరి మీరేం చేత్తున్నారు చెప్పండి మరి..
 డీడీ : పరిష్కార మార్గం మీరే చెప్పండి!
 మాతరాజు : అవగాహన సదస్సులు నిర్వహించాలి సారూ. ఇప్పుడు చేపలు ఎందుకు దొరకడం లేదో మత్స్యకారులకు వివరిస్తే వారు బ్యాన్ పీరియడ్‌లో చేపల వేటకు వెళ్లకుండా ఆపొచ్చండి. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులకు అప్పగిస్తేనే దానిని కంట్రోల్ చేయవచ్చండి.
 డీడీ: ఇంకేమైనా సమస్యలున్నాయా?
 మాతరాజు: పది నెలలుగా డీజీల్ సబ్సిడీ రావడం లేదండి. రూ. 12 కోట్లు రావాలి.
 డీడీ : సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి నివేదిస్తాం.
 డీడీ: నీ పేరేమిటి? డీజిల్ సమస్యలు నీకు ఉన్నాయా?
 మత్స్యకారుడు : సారూ.. కాటాడి సత్యనారాయణ. డీజిల్ సబ్సిడీ పెరగడం లేదండి. గతంలో డీజిల్ రూ.30 ఉన్నప్పుడు రూ. 6 సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు డీజిల్ రూ.70 అయినా అదే సబ్సిడీ వస్తోంది. ఇలా అయితే ఎలా నడుపుతాం సారూ మీరే ఆలోచించండి.
 డీడీ : విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను.
 డీడీ : ఏమండీ.. మీ పేరు?
 మత్స్యకారుడు : సారూ.. కాటాడి మల్లికార్జునరావు. కోస్టల్ ఏరియాలో పరిశ్రమల వల్ల చేపలు పోతున్నాయండి. డీప్ సీ లోకి వెళ్తేగాని చేపలు దొరకడం లేదు. అక్కడ కూడా ఆయిల్ వాసనతో చేప చచ్చిపోతోంది. ఏటకు ఖర్చు ఎక్కువైపోతోంది.
 డీడీ : ప్రభుత్వానికి సమస్య నివేదిస్తాను. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలున్నాయి ఇక వెళతాను మరి సరేనా...
 
 ప్రజెంటర్స్ :
 లక్కింశెట్టి శ్రీనివాసరావు, మంత్రి సతీష్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement