జిల్లాకు జగన్ రాక
- నేడు, రేపు పార్టీ సమీక్షలు
- కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో సమావేశాలు
సాక్షి, విజయవాడ : జిల్లాలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు వచ్చారు.
మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి గుడివాడ వెళ్లారు. ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రికి విజయవాడకు చేరుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, పేర్ని నాని, జోగి రమేష్, నాయకులు పి.గౌతమ్‌రెడ్డి, తాతినేని పద్మావతి, దూలం నాగేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు.
విజయవాడ తూర్పు నుంచి మొదలు..
శనివారం ఉదయం 9గంటలకు బందరురోడ్డులోని కానూరులో ఉన్న ఆహ్వనం కల్యాళ మండపంలో పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని ఆ పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్ తెలిపారు. ఉదయం 9గంటలకు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమీక్షతో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఆ తర్వాత విజయవాడ సెంట్రల్, మైలవరం, నంగదిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెడన, మచిలీపట్నం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల సమీక్షలు జరుగుతామని వివరించారు. ఆదివారం పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. అయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొంటారని పేర్కొన్నారు.