
సంఘీభావం..
రైతు దీక్షకు భారీగా తరలివెళ్లిన జిల్లా నేతలు
కర్నూలు : చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయిన రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నుంచి రెండు రోజులపాటు చేపట్టనున్న నిరాహార రైతు దీక్షకు సంఘీభావంగా జిల్లా నుంచి ఆ పార్టీ నేతలు, అభిమానులు శుక్రవారం తణుకుకు బయలుదేరారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతోపాటు అనేక హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కేవలం పంట రుణాలకు మాఫీ పేరిట కాలయాపన చేసి.. రైతులపై వడ్డీ భారం మోపిన వైనాన్ని ఎండగట్టేందుకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగన్ ఈ దీక్ష చేపట్టారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జగన్ దీక్షకు అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరుతున్నారు.
కాగా ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి శుక్రవారమే రైలులో బయలుదేరారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీతోపాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కూడా ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు సొంత వాహనాల్లో బయలుదేరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఐజయ్యలు శనివారం బయలుదేరుతున్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, బుడ్డా శేషారెడ్డి శుక్రవారమే దీక్షా స్థలికి తరలివెళ్లారు.