పల్లెల్లో పచ్చ చిచ్చు
- టార్గెట్ వైఎస్సార్ సీపీ
- హత్యా రాజకీయాలకు తెగబడుతున్న టీడీపీ
- మంత్రి ఉమ స్వగ్రామంలోనే దారుణం
- రెండు నెలల్లోనే జిల్లాలో 15కు పైగా దాడులు
- పెడచెవిన పెడుతున్న పోలీసులు
సాక్షి, విజయవాడ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ హత్యా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారు. గత రెండు నెలల్లో ఇలాంటి సంఘటనలు 15కు పైగా జరిగాయి. కవ్వింపు చర్యలకు దిగడం, అర్ధరాత్రి ఇళ్లపై రాళ్లతో దాడిచేయడం, చివరికి అవసరమైతే తుదముట్టించటం టీడీపీ కార్యకర్తలకు పరిపాటిగా మారింది. వీరి అరాచకాలకు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా మద్దతు ఇస్తుండడంతో మారణకాండ సాగించేందుకు వెనుకాడడం లేదు.
పోలీసులు కనీసం పట్టించుకోకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసులు బనాయిస్తున్నారు. తాజాగా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తలు మారణకాండ సాగించారు. వైఎస్సార్ సీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచి ఆలోకం కృష్ణారావు (55)ను ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అంతటితో ఆగకుండా గ్రామంలో ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు అక్కారావును బయటకు రావాలని అరుస్తూ ఆయన ఇంటిపై రాళ్లవాన కురిపించారు. దాదాపు గంటకుపైగా టీడీపీ కార్యకర్తలు వీధిగుండాల్లా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోలేదు. స్థానికులు నందిగామ రూరల్ సీఐ రామ్‌కుమార్‌కు దాడుల ఘటనపై సమాచారం ఇవ్వగా కనీసం కానిస్టేబుళ్లను కూడా పంపలేదు. టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి భీతావహ వాతావరణం సృష్టించారు.
మంత్రి ఇలాకాలోనే..
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వగ్రామంలోనే అధికార పార్టీ నేతలు మారణకాండ సాగించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీకి గ్రామంలో మంచి పట్టుంది. కృష్ణారావు, అక్కారావులు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో వారిద్దరినీ తప్పించడం ద్వారా గ్రామంలో పట్టు సాధించాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. కొన్ని నెలలపాటు పోలీసులు గ్రామంలో పికెట్లు నిర్వహించి ఎన్నికల ముందు తొలగించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో నెల రోజులుగా మళ్లీ దాడులు జరుపుతున్నారు.
సీఐ సమక్షంలోనే దాడి..
గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు కుమారుడు వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారని నందిగామ రూరల్ స్టేషన్ సీఐ రామ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అప్పుడు టీడీపీ కార్యకర్తలు సీఐ సమక్షంలోనే వెంకటేశ్వరరావుపై దాడి చేశారు. అయినా కేసు కట్టలేదు. నందిగామలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ క్యాడర్‌పై ఫిర్యాదు చేయగానే విచారణ కూడా జరపకుండా అరెస్ట్‌లు చేయడం, అదే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే కౌంటర్ కేసులు పెట్టుకోండని టీడీపీ శ్రేణుల్ని ప్రోత్సహించడం లేదా రాజీ చేయడం పరిపాటిగా మారింది.
వరుస ఘటనలు
ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా పోలీసులు సీరియస్‌గా స్పందించిన దాఖాలాలు లేవు. ప్రాణహాని ఉందని పోలీసులకు వినతులిచ్చినా పట్టించుకోకుండా అధికార పార్టీకి దాసోహమంటున్నారు. కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో గత రెండు నెలల్లో నాలుగు దాడులు జరిగాయి. వైఎస్సార్ సీపీ కంచికచర్ల మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై మే ఆరో తేదీన టీడీపీ వర్గీయులు దాడి చేయగా ఆయనకు బలమైన గాయాలయ్యాయి. అవనిగడ్డ, గన్నవరం, హనుమాన్‌జంక్షన్, ఆగిరిపల్లి, జగ్గయ్యపేట, తోటపల్లి, నూజివీడు, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.