
ఉండగానే దండుకుందాం..
సాక్షి, కాకినాడ : ‘దీపం’ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు జిల్లా అధికారులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పనిచేసిన అధికారులందరికీ బదిలీ తప్పదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. పైగా జిల్లాస్థాయిలో పనిచేస్తున్న అధికారులందరూ రెండేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్న వారే. దీంతో ఉండగానే దండుకోవాలన్నట్టు.. పలువురు అధికారులు ఆర్జన కోసం ఆరాటపడుతున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. సెప్టెంబర్ 3 నుంచి నెలాఖరు వరకు బదిలీలకు పచ్చజెండాఊపింది. సాధారణంగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్ల వరకు బదిలీలకు అవకాశాలుండవు.
క్లరికల్ స్థాయి ఉద్యోగులు, సిబ్బందినైతే కనీసం మూడేళ్లు కొనసాగిస్తుంటారు. తాజా బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలంటూ లేనందున క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు జిల్లాస్థాయి అధికారులు కూడా పెద్ద సంఖ్యలోనే బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇక్కడే కొనసాగాలని ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరు రాజధానిలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు ఎలాగూ బదిలీ వేటు తప్పదన్న భావనతో పలువురు జిల్లాలోనే ఉండి దండుకునే పనిలో పడ్డారు. బదిలీ తప్పని పలువురు జిల్లాస్థాయి అధికారులు తాత్కాలిక రాజధాని(విజయవాడ) వైపు చూస్తున్నారు.
బదిలీల్లో జోక్యం వలదన్న బాబు..
సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో పనిచేసిన అధికారులను బదిలీ చేసి కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా నేతలకు టీడీపీ అధినేత హుకుం జారీ చేశారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవద్దని, సిఫార్సు లేఖలు ఇవ్వవ ద్దని బాబు జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో జిల్లాలో పనిచేసే వారిని వెనకేసుకొచ్చేకంటే కొత్తగా వచ్చే వారి నుంచే దండుకుంటే మేలన్న ధోరణిలో వారున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ నెలాఖరుతో తమకు స్థానచలనం తప్పదని తెలియడంతో పలువురు అధికారులు అందినంత దండుకోవాలని ఆరాటపడుతున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చకచకా మంజూరు చేయడంతో పాటు అప్రూవల్స్, పర్మిట్లు, అనుమతులు, లెసైన్సుల జారీల్లో ఉదారంగా వ్యవహరిస్తూ భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తోంది. గతేడాది మంజూరు కానిబిల్లులను సాధారణంగా ఇచ్చే పర్సంటేజ్‌ల కంటే ఎక్కువగా ఇస్తే చాలు మంజూరు చేస్తామని అడిగి మరీ చేతులో పెడుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్ని శాఖల అధికారులు ఏదైనా ఫైలు తమ టేబుల్‌పైకి వస్తే చాలు క్షణాల్లో క్లియర్ చేస్తూ పర్సంటేజ్‌లను ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నారు.
‘ఇల్లు చక్కబెట్టుకోవడమే’ఇప్పుడు వారి డ్యూటీ
వివిధ శాఖల్లో డివిజన్, మండల స్థాయిల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. మరోనాలుగైదురోజుల్లో బదిలీలపై మార్గ దర్శకాలు జారీ కాగానే తొలుత జిల్లా అధికారులకు, తర్వాత జిల్లా పరిధిలో బదిలీలకు షెడ్యూల్ విడుదలయ్యే సూచనలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడి చాక బదిలీలు గతంలో ఎన్నడూ చేయలేదని, తక్షణం బదిలీలను నిలుపుదల చేయాలని ఇప్పటికే జేఏసీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఎన్నికల సమయంలో పని చేసిన వారందరినీ కదపాల్సిందేనన్న పట్టుదలతో అధికార పార్టీ పెద్దలున్నారు. ఏదేమైనా వచ్చే నెలలో జిల్లాలో అధికారులు మూడో వంతు బదిలీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ నుంచి కలెక్టర్, జేసీ స్థాయి అధికారులతో పాటు పూర్తిగా కొత్తవారు జిల్లాకు రానున్నారని చెబుతున్నారు.