జిల్లాపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్థిరం.. ఆయన పేరును జిల్లావాసులు ఎన్నటికీ మరిచిపోలేరు. వారి సుదీర్ఘ స్వప్నాలను నిజం చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఆయన అనేకమంది కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దారు. అనేక ప్రాజెక్టులను మంజూరు చేసి ‘కృష్ణా’పై ఆయనకు ఉన్న ఆదరాభిమానాల్ని చాటుకున్నారు. అలాంటి మహానేత ఐదేళ్ల పాలనలో జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయి. ఆయన మరణానంతరం అవి ఒక్కొక్కటిగా కుంటుపడగా, అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అటకెక్కాయి. ముఖ్యంగా బందరు పోర్టు నిర్మాణం, గన్నవరం ఐటీ పార్కు తిరోగమనంలో ఉన్నాయి. బందరులో కృష్ణా యూనివర్సిటీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ అంతంతమాత్రంగా ఏర్పాటయ్యాయి.
సాక్షి, విజయవాడ : రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. 1980 దశకం నుంచే జిల్లాలో వైఎస్సార్‌కు బలమైన వర్గం ఉంది. యువత, సీనియర్లు, మేధావులు, ఇలా అనేకమందిని రాజకీయంగా ప్రోత్సహించి పార్టీలో మంచి ప్రాధాన్యంతోపాటు ఎన్నికల్లో టికెట్లు ఇప్పించి గెలిపించుకునేవారు. 2004 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో అభివృద్ధి శరవేగంగా నడిచింది. 2009లో మరణించే వరకు జిల్లాలో తరచూ పర్యటించేవారు.
ముఖ్యమంత్రి హోదాలో సుమారు 50 సార్లకు పైగా పర్యటించి జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకోవడంతో పాటు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 2006లో గన్నవరంలో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో అక్కడ 1.92 లక్షల చదరపు అడుగుల్లో రూ. 450 కోట్ల నిర్మాణ వ్యయంతో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు తరచూ సమీక్షించి త్వరగా పూర్తిచేయాలని భావించారు. దురదృష్టవశాత్తు వైఎస్ మరణించడంతో ఐటీ పార్కు కలగానే మిగిలిపోయింది. 2010 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మొదటి టవర్‌ను ప్రారంభించారు.
వైఎస్ స్వప్నం సాకారం అయితే 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, 40 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభించేది. జిల్లాను విద్యా రాజధానిగా సుస్థిరం చేయాలని 2008లో నూజివీడులో ట్రిపుల్ ఐటీని ప్రారంభించారు. రెండువేల సీట్లతో ప్రారంభించి శాశ్వత భవనాల నిర్మాణాలు, ఇతర అవసరాలకు రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత అవి కూడా అటకెక్కాయి. నిధుల మాట ఎలా ఉన్నా కేటాయించిన సీట్లలోనూ రోశయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కోత విధించింది. రెండు వేల సీట్లను వెయ్యికి కుదించారు. ప్రస్తుతం వెయ్యి సీట్లతో సమగ్ర వసతులకు దూరంగా ట్రిపుల్ ఐటీ పనిచేస్తుంది.
సపోర్టు లేకుండాపోయిన బందరు పోర్టు
జిల్లా ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదరుచూస్తున్న బందరు పోర్టు నిర్మాణానికి వైఎస్ హయాంలోనే తొలి అడుగుపడింది. అంతముందు అనేక ప్రభుత్వాలు దీనిని పట్టించుకోకుండా ప్రజల డిమాండ్‌ను పక్కనపెట్టాయి. వైఎస్సార్ సాధ్యాసాధ్యాలపై సర్వే చేయించి పోర్టు నిర్మాణానికి అనుకూలంగా నివేదిక రావడంతో 2008 ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వెనువెంటనే రూ. 1500 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఆ తర్వాత ఆయన మరణంతో పోర్టుకు సపోర్టు లేకుండా పోయింది. జిల్లాకో వర్సిటీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృష్ణా యూనివర్సిటీని బందరులో 2008 ఏప్రిల్ 23న ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత శాశ్వత భవనాల నిర్మాణం కోసం 180 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యంతో అలానే మిగిలిపోయింది. ప్రస్తుతం నిధుల లేమితో వర్సిటీ ఇబ్బందులు పడుతుంది.
కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం..
కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. 150 ఏళ్లనాడు ఏర్పాటుచేసిన సాగునీటి విధానం తప్ప తర్వాతి కాలంలో ఆధునికీకరణ జరగలేదని గుర్తించిన వైఎస్సార్ డెల్టాను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సాగునీటి కాల్వల మరమ్మతులకు నాలుగువేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. ఈ మరమ్మతులను 56 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించారు.
వీటిలో 20 కృష్ణా తూర్పు డెల్టాలో ఉన్న పంట కాల్వలు, మురుగునీటిని ఆధునీకరించేందుకు 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. దీనికి రూ. 2180 కోట్లు కేటాయించగా, 2007-08లో ఇరిగేషన్ సెక్టార్‌లో 13 ప్యాకేజీలకు రూ. 1,185 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. 204 కోట్లతో ప్రకాశం బ్యారేజి, హెడ్‌వర్క్‌ను ఆధునీకరించారు. ఏలూరు కాల్వకు రూ. 43.12 కోట్లు, బందరు కాల్వ ఆధునీకరణకు రూ. 333.7 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ 2016 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ మరణంతో డెల్టా ఆధునీకరణ నత్తనడకన సాగుతోంది.
జిల్లాపై ‘రాజ’ముద్ర
Published Mon, Sep 2 2013 2:39 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement