
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు టౌన్) : జిల్లావ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా పనిచేయాలని, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ హెచ్చరికలు జారీచేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల పట్ల మర్యాదగా నడచుకోవటంతోపాటు, వారి సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు.
ఇక భూ సంబంధిత వివాదాలు కోర్టు పరిధిలో ఉంటే వాటిని సివిల్ కోర్టుల్లోనే తేల్చుకోవాలని, వాటిని పోలీసులు పరిష్కరించే అవకాశం లేదన్నారు. కోర్టుల్లో దావా ఉంటే ఆయా వ్యక్తులు కోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాలని కోరారు. భారీగా కురుస్తోన్న వర్షాలతో పోలవరం ముంపు గ్రామాలు జలమయం అయ్యాయని, అటువంటి ప్రాం తాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పో లీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సమస్యల్లో కొన్ని..
⇔ గుర్తుతెలియని వ్యక్తులు తమ మార్కెటింగ్ యార్డ్‌నకు సంబంధించిన రశీదులు నకిలీవి వినియోగిస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోరారు
⇔ తణుకు మండలానికి చెందిన ఒక మహిళ తమ మరిది తమను ఇంటినుంచి పంపేయాలనే ఉద్దేశంతో కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు
⇔ భీమవరానికి చెందిన మహిళ తన కోడలు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తన కుమారుడు, తనపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడుతుందని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు
⇔ కొయ్యలగూడెం మండలానికి చెందిన ఒక వ్యక్తి డైట్ కాలేజీలో ప్రవేశం కల్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని, చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment