విజృంభిస్తున్న విషజ్వరాలు | District toxic fevers | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న విషజ్వరాలు

Published Fri, Sep 19 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

విజృంభిస్తున్న విషజ్వరాలు

విజృంభిస్తున్న విషజ్వరాలు

  • డెంగీతో జిల్లాలో ఇప్పటికే ఆరుగురి మృతి
  • అల్లాడుతున్న ప్రజలు
  • రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఇబ్బందులు
  • అధికారికంగా నమోదైన విషజ్వరాలే 218
  • అనధికారికంగా వేలల్లోనే
  • సాక్షి, చిత్తూరు: పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగకు చెందిన వై.మంగమ్మ(35)కు పది రోజుల క్రితం జ్వరం సోకింది. పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గలేదు. డెంగీ లక్షణాలున్నట్లు భావించిన వైద్యులు తిరుపతి స్విమ్స్‌కు సిఫారసు చేశారు. అక్కడ వైద్యులు డెంగీ అని తేల్చారు. చికిత్స చేస్తుండగా మంగమ్మ ఈ నెల 12న మృతి చెందింది. మంగమ్మతో పాటు ఆమె భర్త బాలాజీ, కుమారుడు ప్రకాష్, కుమార్తె వెన్నెలకు కూడా ఇదే సమయంలో డెంగీ సోకింది. అందరూ స్విమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు.
     
    రామకుప్పం మండలం అల్లెకుప్పంలో వసుంధర(7)కు జ్వరం సోకింది. స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతి చెందింది. డెంగీతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
     
    ..వీళ్లిద్దరే కాదు...ఈ ఏడాది డెంగీ దెబ్బకు ఆరుగురు మరణించారు. అధికారులు మాత్రం ఈ ఏడాది 15 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరు మాత్రమే చనిపోయారని చెబుతున్నారు. జిల్లాలోని ప్రజలు విషజ్వరాల దెబ్బకు విలవిలాడిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోజుల తరబడి వైద్యం చేయించుకుం టున్నారు. వారిలో కొందరు మరణిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం విషజ్వరాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఓవైపు దోమల తీవ్రత, మరో వైపు వాతావరణంలోని మార్పులతోనే  విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

    జిల్లాలో ఈ సీజన్‌లో 79 మలేరియా, 67 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలను పక్కన పెడితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేవారి సంఖ్య వేలల్లో ఉంటుందని  చెబుతున్నారు. అయినా దోమల నివారణ కోసం ఫాగింగ్, గంబూషియా చేపలను మురుగుకాలువల్లో వదలడం, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ, మునిసిపల్‌శాఖ అధికారులు మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
     
    ఇంత నిర్లక్ష్యమా?

    వర్షాకాలం కావడంతో దోమలు తాకిడి అధికంగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఫాగింగ్ చేయూల్సి ఉంది. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు 1210 లీటర్ల మలాథియాన్ ద్రావణం వచ్చింది. జిల్లాలో ఫాగింగ్ చేసేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఇందులోనూ అధికారులు  కేవలం 50 లీటర్లు మాత్రమే ఫాగింగ్ చేశారు. జిల్లాలోని 20 క్లస్టర్లు ఉన్నాయి. వచ్చిన మలాథియన్ తీసుకెళ్లి  ఫాకింగ్ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ద్రావణం తీసుకెళ్లిన వారిలో కొంతమంది మాత్రమే ఫాగింగ్ చేశారు.
     
    పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ?
     
    జిల్లావ్యాప్తంగా 76 పీహెచ్‌సీ(ప్రైమరీ హెల్త్ సెంట ర్)లు ఉన్నాయి. 418 దాకా సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రజలు రోగాలబారిన పడి అల్లాడుతుంటే, గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి చికి త్స చేయడంలో కూడా పీహెచ్‌సీలు నిర్లిప్తంగా ఉన్నా యి. ఉదయం 9 నుంచి 12 గంటలు, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు ఓపీ ఉండాలి. ఈ సమయం లో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. అయితే చాలాచోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే చాలామంది ఇంటిదారి పడుతున్నారు.

    మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నర్సులు మాత్రమే ఉంటున్నారు. జ్వరం వచ్చిందని రోగులు వెళితే మాత్రలు చేతిలో పెడుతున్నారు. ఇంజెక్షన్ అవసరమైతే నీడిల్, సిరంజి  రోగులు తెచ్చుకోవల్సిందే!. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. అక్కడికి వెళితే రక్తపరీక్షలు, మందులకు కలిపి ఒక్కొక్కరికీ రూ.1500 నుంచి 3వేల రూపాయల వరకు ఖర్చవుతోంది.
     
    డెంగీతో ఒకరు చనిపోయారు


    జిల్లాలో ఈ సీజన్‌లో 15 మంది డెంగీ బారినపడ్డారు. మంగమ్మ మాత్రమే చనిపోయారు. తక్కిన వారు డెంగీతో చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. ల్యాబ్‌లో సరైన రిపోర్టులు లేని కారణంగా వాటిని మేం డెంగీ డెత్‌కేసులుగా పరిగణించలేం. మలాథియాన్ అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో ఫాగింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం.
     -దోసారెడ్డి, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement