సాక్షి, అమరావతి: పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులోభాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలల్లో 19 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా నియామక ప్రతాలను అందజేసింది. ఆ వివరాలు జిల్లాల వారీగా..
పశ్చిమ గోదావరి
గ్రామ,వార్డు సచివాలయ అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ ముత్యాల రాజు మాట్లాడుతూ.. 4600 మంది అభ్యర్థులకు సోమవారం ఒక్క రోజే నియామక పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. 16 కేటగిరిలో జిల్లాలో 9576 నియామకాల్లో 8712 మంది అభ్యర్థులకు కాల్ లేటర్స్ పంపామని అన్నారు. 72 గంటల్లో స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆ దిశగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. తన ఇన్నేళ్ల ఉద్యోగ నిర్వహణలో ఈ విధంగా ఒకే సారి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..అభ్యర్థులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ ఉద్యోగాల కోసం విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రుల కూడా ఎన్నో కలలు కన్నారని, కావాలనే ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద జల్లుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ 1,26,000 కుటుంబాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. గ్రామ స్థాయిలో పనిచేసే తామందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ఆశకిరణమని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాలకు సీఎం జగన్ నడుంబిగించారని, రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా మొత్తం 1,36000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉద్యోగాలు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రలో వైఎస్ జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హమీనీ కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారని, లంచాలకు తావు లేకుండా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు.
నెల్లూరు
జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శేషగిరి బాబు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరప్రసాద్ రావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాకుళం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాలు ఎంత నిజాయితీగా జరిగాయో, ఉద్యోగులు కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని సూచించారు. అవినీతి లేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
చిత్తూరు
జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నియామకాల పత్రాలను తిరుపతి ఎస్‌వీయు శ్రీనివాస ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, తుడా విసి గిరీషా పాల్గొన్నారు
విశాఖపట్నం
జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం నగరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు.
కర్నూలు
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, అర్థర్, ఎంపీ సంజీవ్ కుమార్, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య పాల్గొన్నారు.
ప్రకాశం
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందజేశారు. మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం డివిజనల్ రెవిన్యూ అధికారి ఎం శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
తూర్పుగోదావరి
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు. ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ పావని, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కమీషనర్ రమేష్ పాల్గొన్నారు.
విజయనగరం
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే లు కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, అలజంగి జోగారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం
గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన అభ్యర్థులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ఎంపీ రంగయ్య, ఎంఎల్సీ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment