‘తెలుగుతల్లి సౌ‘భాగ్య’ నగరం హైదరాబాద్‌ను చేజార్చుకునేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరు.. అరవై ఏళ్ల సమష్టి కృషి ఫలితాన్ని తెలంగాణకు అప్పగించి చేతులు ముడుచుకు కూర్చునేది లేదు.. ఎలాంటి ఉద్యమాలైనా, ఎలాంటి త్యాగాలైనా చేసి హైదరాబాద్ సహా సమైక్యాంధ్రను సాధించి తీరుతాం...’ అంటూ విశాఖ నగర ప్రజానీకం, మేధావులు, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత ముక్త కంఠంతో నినదించారు. నగరంలోని కావేరి ఫంక్షన్ హాల్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ఎవరెటు?’ చైతన్య పథం చర్చా వేదికలో వీరందరి అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా, ఆవేశభరితంగా సాగాయి.
సాక్షి, విశాఖపట్నం : విభజనకు కారకులైన నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని విశాఖ వాసులు హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చే వరకు ఉద్యమాగ్ని చల్లారదని స్పష్టం చేశారు. ‘సమైక్యాంధ్ర కోసం ఎంతవరకైనా పోరాడుతాం. ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్తాం. శాంతియుత నిరసన కార్యక్రమాలతో తమ వాణి విన్పిస్తాం...పాలకుల మెడ వంచుతాం.’ అని ఘాటుగా స్పందించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ సంయుక్తంగా సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్య పథం చర్చా కార్యక్రమంలో హాజరైన వక్తలంతా సమైక్య గళం విప్పారు.
స్థానిక కావేరి కన్నడ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మేధావులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగ సంఘం నేతలు, కార్మిక సంఘం నేతలు, వివిధ రంగాల నిష్ణాతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మనోగతాన్ని తెలి యజేశారు. విభజనతో సీమాంధ్రకు జరిగే నష్టాలు ఏకరువు పెట్టారు. రాహుల్‌గాంధీ పట్టాభిషేకం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి అనుసరిస్తున్న తీరును కడిగి పారేశారు. సమైక్యాంధ్ర ద్రోహిగా పేర్కొంటూ చంద్రబాబుపై వక్తలు విరుచుకుపడ్డారు.
రాజకీయ నిరుద్యోగైన కేసీఆర్ ఒక నాజీగా, నియంతలా భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి చిదంబరం, నరేంద్ర మోడి ఎవరని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌లను రాజప్రతినిధులుగా అభివర్ణించారు. విజయమ్మ ఆమరణ దీక్ష చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా కొనియాడారు. హెదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, అందరిదని, దాన్ని వేరు చేయలేరని ఘంటాపదంగా చెప్పారు. సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం చల్లారదని స్పష్టం చేశారు.
విభజిస్తే విప్లవమే
Published Tue, Aug 20 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement