
గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఉన్నతాధికారులతో ఈరోజు గవర్నర్ సమీక్షించారు. శాసనసభ, శాసన మండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేటాయింపునకు సంబంధించి స్పీకర్, చైర్మన్లతో చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశం పారదర్శికంగా ఉండాలన్నారు. అవసరమైతే స్వయంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. విభజన వల్ల తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.
జంట నగరాల్లో అక్రమ నీటి సరఫరా విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామల్లో తాగునీటి కొరతలేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.