సాక్షి, అమరావతి : దీపావళి పండుగ నేపథ్యంలో ఉద్యోగుల వరుస సెలవులతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి. పండుగను పురస్కరించుకుని అధికారులు, ఉద్యోగులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఈ నెల 19(గురువారం)న దీపావళి సందర్భంగా సెలవు. దీంతో పలువురు ఉద్యోగులు బుధవారం ఆప్షనల్ సెలవును వినియోగించుకుంటున్నారు. ఇక శుక్రవారం సాధారణ (క్యాజువల్) సెలవు పెట్టుకుంటున్నారు. ఇక శని, ఆదివారాలూ ఎలాగూ సెలవే. ఫలితంగా మొత్తం ఐదురోజుల సెలవు కలిసొచ్చినట్టయింది. సాధారణంగా ఒక ఉద్యోగి సంవత్సరంలో ఐదు ఆప్షనల్ సెలవుల్ని తీసుకోవచ్చు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31లోగా వీటిని ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ సెలవునే బుధవారం వాడుకుంటున్నారు.
హైదరాబాద్ బస్సులు కిటకిట..
ఇదిలా ఉండగా మెజారిటీ ఉద్యోగుల కుటుంబాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వారి పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. ఇలా వరుస సెలవులు కలసిరావడంతో ఉద్యోగులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళుతున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే హైదరాబాద్‌కు వెళ్లేవారితో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌లోనూ రద్దీ ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు చెందినవారు హైదరాబాద్‌కున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. బుధవారమూ విజయవాడ బస్టాండ్‌లో రద్దీ కొనసాగేలా కనిపిస్తోంది. ఉద్యోగుల సంగతి అటుంచితే సాధారణ ప్రయాణికులూ దీపావళి వేళ ఊళ్లకు పయనమయ్యారు. నాలుగు రోజులపాటు సొంతవూర్లో బంధువులతో గడిపి పండుగను జరుపుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే బయల్దేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment