తణుకులోని ఓ హాస్పిటల్‌లో బాధితురాలితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి (ఫైల్)
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: వైద్య ఆరోగ్య శాఖలో బయటపడుతోన్న ఉదంతాలు జిల్లా వైద్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. డబ్బు వ్యామోహంతో కొందరు వైద్యులు చేస్తోన్న అధర్మ వైద్యం జిల్లాలో తణుకును ముందు వరుసలో నిలిపింది. ప్రైవేటు రంగంలో ఇస్టానుసారంగా చేస్తోన్న సిజేరియన్లు, డెంగీ వ్యాధి పేరుతో వైద్యం వంటి అంశాలపై దృష్టి సారించిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు తాజాగా అర్హత లేని వైద్యం చేస్తోన్న వైద్యుల భరతం పడుతోంది. గణపవరం మండలం జల్లి కొమ్మరలో ఇటీవల జరిగిన మరణంపై డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి విచారణ జరిపారు. అనంతరం ఆమె అర్హతలేని వైద్యం చేస్తున్నారంటూ తణుకులోని ఓ హాస్పటల్‌లో మత్తు వైద్యుడు డాక్టర్ డి.బిల్లీగ్రహంను నిలదీసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె ఇటీవల కాలంలో జ్వరపీడితులు, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గాయని చికిత్స చేయించుకున్న వారి కేస్ షీట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేస్ షీట్‌లలో జనరల్ ఫిజీషియన్‌కు బదులుగా సదరు బిల్లీగ్రహం వైద్యమే కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు
డాక్టర్ బిల్లీగ్రహం ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో తనిఖీల నేపథ్యంలో సాక్షిలో వచ్చిన కథనానికి అనేకమంది బాధితులు బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి రుగ్మతలకు కూడా మా వద్ద వేలకు వేలు గుంజారంటూ వాపోయారు. పదేళ్లుగా వైద్యం చేస్తోన్న సదరు వైద్యుడు తన ఆస్పత్రిలో ఎక్కువగా పాయిజన్ కేసులు, ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిన కేసులు ఇతర అత్యవసర కేసులన్నిటికీ వైద్యం చేస్తున్నట్టు తణుకు వాసులు చెప్పారు. కేవలం మత్తు వైద్యుడు ఇన్ని రకాల అత్యవసర వైద్యం చేస్తుంటే వైద్యాధికారులు, ఐఎంఏ ప్రతినిధులు ఏం చేస్తున్నారనేది ప్రజానీకం ప్రశ్న. జిల్లావ్యాప్తంగా నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యులు, లేని డిగ్రీలు తగిలించించుకుని చేస్తోన్న వైద్యం తాలూకా వ్యవహారాలు రెండేళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి.
ప్రాణానికి డబ్బుతో ముడి
2015లో బయటపడ్డ నకిలీ వైద్యుడు బొల్లినేని శ్రీకాంత్ ఘటన జిల్లాను కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తరువాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నకిలీ వైద్యుల ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల తణుకు ఏరియా ఆస్పత్రికి కూతవేటు దూరంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో కాలుకు పుండు పడి చికిత్స పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వైద్యుడి నిర్వాకం కారణంగానే ప్రాణాలు పోయాయనే ఆరోపణలతో జిల్లాకు చెందిన ఒక మంత్రి కలుగచేసుకోవడంతో బాధిత కుటుంబానికి రూ. రూ.1.50 లక్షలు ఇచ్చి గొడవ లేకుండా సరిచేసుకున్నట్టు సమాచారం. వైద్యాన్ని వ్యాపారం చేసే క్రమంలో ఒక ఫార్మసిస్ట్ నడుపుతోన్న ఈ ఆస్పత్రిలో వైద్యులు గెస్ట్ రోల్ పోషిస్తున్నారని, ఆస్పత్రి నిర్వహణకు అనుమతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో మరొక ఆస్పత్రిలో ఇటీవల మృతిచెందిన గర్భిణి ఉదంతం కూడా అనుమానాస్పదంగా ఉంది. డెంగీ అని ఆస్పత్రి వైద్యులు అంటుండగా, చేసిన పొరపాటును డెంగీ అని చెప్పి కప్పిపుచ్చుతున్నారని, గర్భిణికి మూడు నెలల ముందుగా శస్త్రచికిత్స చేయడం వలనే చనిపోయిందని వైద్యాధికారి చెబుతున్నారు. రెండు సార్లు జిల్లా వైద్యాధికారులు విచారణ చేసిన ఈ వ్యవహారం రాష్ట్ర వైద్యాధికారి చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం.
వైద్యాధికారులపై చిందులు వేస్తున్న నేతలు
తణుకులో ఇటీవల సిజేరియన్లు భారీగా చేస్తున్నారనే వ్యవహారంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి దూకుడును అడ్డుకోవాలంటూ తణుకు ఐఎంఏ ప్రతినిధులు తణుకు, నిడదవోలు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చిన ఒక మంత్రిని కలిసి వైద్యాధికారికి ఫోన్ చేయించారు.
రూ.25 వేలు బిల్లు వేశారు
డయేరియా లక్షణాలతో మా అమ్మను తణుకులోని డాక్టర్ డి.బిల్లీగ్రహం హాస్పటల్‌లో చూపించాను. పదిరోజులపాటు వైద్యం చేసి రూ.25 వేలు బిల్లు వేశారు. రక్త పరీక్షలు అక్కడ మాత్రమే చేయించుకోవాలని, మందులు ఆస్పత్రి డిస్పెన్సరీలోనే తీసుకోవాలనే నిబంధనలు పెట్టారు. రెండు రోజుల ట్రీట్‌మెంట్ పదిరోజులు సాగదీశారు. ఆఖరుకు రూ.1500 మాత్రమే తగ్గించి బిల్లు చెల్లించాం.
–ఎం.లక్ష్మణ్, పైడిపర్రు
Comments
Please login to add a commentAdd a comment