బాధితులం.. న్యాయం చేయండి
గ్రీవెన్స్‌లో ఎస్పీకి వేడుకోలు
గుంటూరుక్రైం
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. రూరల్ అదనపు ఎస్పీ గోళ్ళ రామాంజనేయులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 40కు పైగా ఫిర్యాదులను ఏఎస్పీలు రామాం జనేయులు, టి.శోభామంజరి పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే..
దాడి చేశారు..
అప్పుల బాధతో నా కుమారుడు పాపారావు గత ఏడాది నవంబరు 16న ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు, మరియకుమార్‌ల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోటు రాశాడు. కేసు విచారణ కొనసాగుతోంది. గ్రామంలోని రాట్నాల హనుమంతరావు, రాజేశ్వరరావు, శేషు, జగన్నాథం, మరికొందరు కలిసి ఈనెల 8వ తేదీన మా ఇంటికి వచ్చి మా కుమారుడు రూ.5 లక్షలు బాకి ఉన్నాడని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట పడేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో మాపై దాడికి పాల్పడి తిరిగి మాపైనే అక్రమ కేసు బనాయించారు. వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలి.
- వెంకాయమ్మ, దుర్గమ్మ, అత్తా కోడళ్ళు, కొత్తపాలెం, యడ్లపాడు మండలం
భూమి కాజేశారు..
మా తాతపేరుతో కొల్లిపర మండలం మున్నంగిలో 59 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన బి.వెంకటరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి ఆ భూమిని విక్రయించారు. ఇదేమిటనిప్రశ్నించిన దుర్భాషలాడుతూ ఈనెల 9న దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలి.
- సుగ్గుల రవీంద్రబాబు, గంగానమ్మపేట, తెనాలి
కుమార్తె ఆచూకీ తెలపండి..
నా కుమార్తె చేబ్రోలులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఈనెల 5న కళాశాలకు వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు వద్ద విచారించినా ప్రయోజనంలేకపోయింది. మా గ్రామంలోని కొందరు వ్యక్తులపై అనుమానంగా ఉంది. వారిని విచారించి నాకుమార్తెను తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
- మద్దెల మంజుల, మారీసుపేట, తెనాలి