పట్టించుకోరా? | Do not care? | Sakshi
Sakshi News home page

పట్టించుకోరా?

Published Thu, Nov 20 2014 3:05 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

పట్టించుకోరా? - Sakshi

పట్టించుకోరా?

సాక్షి, కర్నూలు : పని భారంతో సతమతమవుతున్నా.. సహనంతో సేవలందిస్తున్నప్పటికీ 15 నెలలుగా వేతనాలు అందక ఐకేపీ విలేజ్ అర్గనైజేషన్ అసిస్టెంట్లు(వీవోఏ-యానిమేటర్లు) అవస్థలు పడుతున్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తొలినాళ్లలో ప్రయాణ భత్యాల రూపంలో కొద్ది మొత్తంలో ముట్టజెప్పినా వేతనాలకు కాలక్రమంలో కేవలం గ్రామ సంఘాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

జిల్లాలో మొత్తం 39,500 డ్వాక్రా సంఘాలు ఉండగా 1,920 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో గ్రామ సమాఖ్యలోని సంఘాల కార్యకలాపాలు, ఫైళ్ల నిర్వహణ, ఇతర ఆమ్ ఆద్మీ, అభయ హస్తం, బీమా యోజన, జన్‌ధన్, మొబైల్ బుక్ కీపింగ్ వంటి దాదాపు 19 రకాలకు పైగా విధులను నిర్వర్తిస్తున్నారు.

 జిల్లాలో తొలుత 1,400కు పైగా వీఓఏలు ఉండగా ఇటీవల మరికొన్ని డ్వాక్రా సంఘాలు నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో వీరి సంఖ్య 1,585కు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత తదితర విషయాలపై వీరి డిమాండ్ల నేపథ్యంలో సీఏలకు నెలకు రూ. 2 వేల వ ంతున వేతనాలను చెల్లించేలా నిర్ణయిస్తూ 2013 మే నెలలో సెర్ఫ్ సీఈవో ఉత్తర్వులు వెలువరించారు.

దీనికి అదనంగా గ్రామ సంఘం నుంచి రూ. 1,500, గ్రామ సంఘం రికార్డులకు రాసినందుకు రూ. 3,00 అంటే మొత్తం రూ. 3,800లను వేతనంగా చెల్లించేలా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి అదే ఏడాది జూన్, జూలై వరకు వేతనాలపై గంపెడాశతో ఎదురుచూసిన తమకు తీవ్ర నిరాశ మిగిలిందని వీఓఏలు వాపోతున్నారు. కేవలం కొందరికి మాత్రమే రూ. 2 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన అధికారులు మిగిలిన వారి వేతనాల చెల్లింపు ప్రక్రియను గాలికొదిలేశారని ఆరోపిస్తున్నారు.

అదేమంటే బ్యాంకు ఖాతాల వివరాలను సిబ్బంది ఆన్‌లైన్ చేయడంలో జరిగిన జాప్యమే కారణమంటున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన రూ. 1,500కు సంబంధించి నిర్దిష్ట ఉత్తర్వులు లేకపోవడంతో కొన్నిచోట్ల చెల్లింపులకు వ్యతిరేకత తలెత్తుతోందని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అటు వేతనాలు లేక, ఇటు గ్రామ సంఘాల సొమ్ము అందక రెంటికీ చెడ్డ చందాన పరిస్థితి తయారైందని వాపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోందని, సెర్ఫ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కర్నూలులోని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంటి ఎదుట యానిమేటర్లు ధర్నా నిర్వహించారు.

వెట్టిచాకిరీ..
డ్వాక్రా సంఘాలకు సంబంధించి 19 రకాల పనులను వీవోఏలకు అప్పగించారు. వీటి నిర్వహణకు సంఘాల సభ్యులు ఇంటింటికి తిరిగి అవసరమైన వివరాలను సేకరిస్తున్నాం. ఇది చాలక కులగణన సర్వేకు కూడా వీఓఏలను వినియోగిస్తున్నామంటున్నారు. అదనపు పనులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు.

ఏడాదిన్నరగా వేతనాలు లేకుండా పడరాని పాట్లు పడుతున్నా ఇంకా అదనంగా పనులను అప్పచెప్పుతున్నారు. వేతనాల చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.
 - టి. మద్దిలేటి, జిల్లా యానిమేటర్ల సంఘం అధ్యక్షుడు

బడ్జెట్ కేటాయింపులేదు..
యానిమేటర్ల వేతనాల చెల్లింపునకు సంబంధించి బడ్జెట్ కేటాయించ లేదు. దీంతో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. 1,585 మంది యానిమేటర్లకు సంబంధించి కొందరికి గత ఏడాది జూన్, జూలై నెలల్లో రూ. 2 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. వేతన బకాయిల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని సెర్ఫ్ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement