సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పౌరులకు పూర్తిస్థాయిలో అందాలని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యుడు కాకుమాను పెద పేరిరెడ్డి స్పష్టంచేశారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కమిషన్ కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
బాధితులకు సత్వర న్యాయంకోసం యత్నిస్తున్నామని, అందినరోజే ఫిర్యాదులను పరిశీలించి, తగిన ఉత్తర్వులు ఇస్తున్నామన్నారు. పోలీసుల తీరుపై, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,298 ఫిర్యాదులు అందగా వాటిలో7,073 ఫిర్యాదులను విచారణకు స్వీకరించామన్నారు.