
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానాలతో పాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే దేవాలయాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు తొలగించవద్దని హైకోర్టు బుధవారం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)ను ఆదేశించింది. అయితే ఈవో జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మాత్రం సమాధానం ఇవ్వాలని హిందూయేతర ఉద్యోగులకు స్పష్టం చేసింది.
ఈవో జారీ చేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై తరువాత లోతుగా విచారణ జరుపుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment