- కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పాలకమండళ్ల కాల వ్యవధిని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించడంపై హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పాలక మండళ్ల కాల వ్యవధిని కుదిస్తూ ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన వై.ఆంజనేయులు, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.