పెదవాల్తేరు, కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు, తూర్పు నియోజక వర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. జీవీఎంసీ 17వ వార్డు పెద జాలరిపేటలో శనివారం ఆయన స్థానిక నాయకుడు కందుకూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దోమల నివారణకు మెషీన్లు పంపిణీ చేశారు. అనంతరం 200 మందికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ జాలరిపేటలో సమస్యలు తిష్ట వేశాయన్నారు.
అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో గెలిచి ప్రజా సమస్యలను విస్మరించిన ఎమ్మెల్యేను ఇంట్లో కూర్చోపెట్టాలని అన్నారు. పెదజాలరిపేటలో పట్టాలు లేక మత్స్యకారులు ఇళ్లు కూడా నిర్మిం చుకోలేక పోతున్నారన్నారు. వీరి సమస్యలు పరిష్కరించడంలో ఇక్కడి ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే జాలరిపేటలో అందరికీ పట్టాలు ఇప్పించి పక్కా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, తాగునీరు సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్డులో దోమలు నివారణకు మెషీన్లు పంపిణీ చేశామని, వార్డు సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కండిపిల్లి అప్పారావు, మత్స్యకార నాయకులు తెడ్డు పరసన్న, తెడ్డు గుర్నాథం, కారీ శ్రీలక్ష్మీ, దాసరాజు, చిల్లా రామారావు, రాము, రమణారెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.