మా సిఫార్సులు పనికిరావా?
{పత్యేక ప్యాకేజీ పనుల ప్రతిపాదనకు
ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు
అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు
గైడ్‌లైన్స్ ప్రకారమే కేటాయించామన్న కలెక్టర్
పరిశీలించాలన్న మంత్రి అయ్యన్న
విశాఖపట్నం: నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎలాగూ లేవు..వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూరూ చేసే నిధుల విషయంలోనైనా తమను పట్టించు కోకపోతే ఎలా?వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం మంజూరు చేసిన రూ.100కోట్ల నిధులకు సంబంధించి ప్రతిపాదనల విషయంలోకూడా పరిగణనలోకి తీసుకోలేదంటూ జిల్లాయంత్రాంగంపై పలువురుఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్ట పంచాయితీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం మధ్యాహ్నం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక ఫ్యాకేజీ నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యేలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.23 కోట్ల మేరకు పనులను ప్రతిపాదించినటు ్టకలెక్టర్ యువరాజ్ వెల్లడించగా..తమనెందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు తదితరులు ప్రశ్నించారు. హుద్ హుద్ దెబ్బకు జిల్లాలో గ్రోయిన్స్, చెక్‌డామ్స్ పూర్తిగా దెబ్బతిన్నా యని, సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటన్నారని వారు వివరించారు. వాటి శాశ్వత పునరుద్ధరణ పనులకు ఈ నిధులను కేటాయించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అంచనాలు రూపొందించాలని మంత్రి అయ్యన్న నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంచనాలందగానే ప్రత్యేక ప్యాకేజీ నిధులతో ఈ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచ్చించాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనలకు లోబడి ఎమ్మెల్యేలు పనులు ప్రతిపాదించాలని సూచించారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, శారదానదితో పాటు పలు చోట్ల వంతెనల నిర్మాణానికిఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు.
నియోజకవర్గానికి 10 పంచాయితీ భవనాలు
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాలో వంద పంచాయితీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఒక్కో భవనం రూ.13లక్షల అంచనాతో నిర్మిస్తామన్నారు. భవనాల్లేని మరో 80 పంచాయితీలకు వచ్చే ఏడాది నిర్మించేందుకు ప్రతిపాదిస్తామన్నారు. నియోజక వర్గానికి 15 స్మశాన వాటికలను ఒక్కొక్కటి రూ.10లక్షల అంచనాతో ఆధునికీకరిస్తామన్నారు.
అసంపూర్తిగా ఉన్న 670 అంగన్‌వాడీ భవనాలను కూడా ఉపాధి హామీలో చేపట్టాలని నిర్ణయించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని, ఎంపీ డాక్టర్ కె.హరిబాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వంగలపూడి అనిత, కేఎస్‌ఎన్ రాజు, కిడారి సర్వేశ్వరరావు, పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు.