
పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎంపీ
హొళగుంద/ఆలూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. శనివారం కర్నూలు జిల్లా హొళగుందలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని.. అలాంటి పార్టీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తే లేదని ఆమె మరోసారి తేల్చి చెప్పారు. ఎల్లో మీడియా అసత్య ప్రసారాలు చేస్తోందని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.