సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గాలిలో దీపమని మరోసారి తేలింది. అత్యవసర పరిస్థితుల్లో సర్కారు డాక్టర్లను నమ్ముకుంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని రూడీ అయింది. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన వారు సకాలంలో వైద్యసేవలు అందకే ప్రాణాలు కోల్పోయారు. వారికి సేవలు అందించడంలో జరిగిన తీవ్రజాప్యంతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల(పెద్దాసుపత్రి)లో సేవల డొల్లతనం బయటపడింది. వైద్యాధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా కలెక్టర్ శ్రీకాంత్ వైద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోకుండా మాటలతో సరిపెట్టడాన్ని వైద్యశాఖలోని కొందరే ఆక్షేపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైద్యశాఖపై ప్రత్యేక దృష్టిసారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినచర్యలు తీసుకోకుండా ఆయన మాటలతో సరిపెడుతుం డటంతో పరిస్థితిలో మార్పు కరువైంది.
వైద్యసేవల్లో తీవ్రజాప్యం
జిల్లాలో 24 గంటలూ సేవలందిచాల్సిన ఆస్పత్రులు 45 ఉన్నాయి. ఇవేమి 24 గంటల పాటు పనిచేస్తున్న దాఖలాలు
లేవు. శనివారం రోడ్డుప్రమాదం జరిగిన వెంకటాచలం టోల్‌ప్లాజాకు సమీపంలోనే 24 గంటలూ పనిచేసే క్లస్టర్ ఆసుపత్రి ఉంది. ఆస్పత్రి వైద్యు లు, సిబ్బంది విధుల్లో ఉండి గాయపడిన వారికి సకాలంలో వైద్యసేవలు అంది ఉంటే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరైనా బతికే అవకాశాలు ఉండేవి. అయినా వెంకటాచలం అసుపత్రి సిబ్బందిపై చ ర్యలు లేవు. ఇక డీఎస్‌ఆర్ ఆసుపత్రి విషయానికొ స్తే తెల్లవారుజామున 5 గంటలకే క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారందరూ అంబులెన్స్ దిగి నడిచి లోపలకు వెళ్లారు. ఆ సమయానికి ఉండాల్సిన ఇద్దరు డ్యూ టీ డాక్టర్లతో పాటు సిబ్బంది కనిపించలేదు. గా యపడిన వారిని పట్టించుకునే వారే కరువయ్యా రు. ఉదయం 8.30 గంటలకు ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఆసుపత్రికి చేరుకుని వైద్యులకు ఫోన్ చే శారు. 9 గంటలకు జేసీ లక్ష్మీకాంతం, 9.15 గంట లకు కలెక్టర్ శ్రీకాంత్ చేరుకున్నారు. అప్పటికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాలేదు. డ్యూటీ డా క్టర్లూ కనిపించలేదు. ఇక మెడికల్ కళాశాలకు సం బంధించి వేలాది రూపాయల జీతాలు తీసుకుం టున్న పదుల సంఖ్యలో డాక్టర్లు ఏమయ్యారో అ ధికారులకే తెలియాలి. వైద్యాధికారుల నిర్లక్ష్యంతో గాయాలతో ఆసుపత్రిలోకి నడిచి వచ్చిన బాధితులు నాలుగు గంటల పాటు వైద్యసేవలు అంద క శవాలుగా మారి స్ట్రెచర్‌లపై బయటకు వచ్చా రు. ఈ పాపం ఆసుపత్రి సిబ్బందిదా.. వైద్యాధి కారులదా..జిల్లా అధికారులదా..కఠినంగా వ్యవహరించని ఉన్నతాధికారులదా!
ఉన్నతాధికారులే సాక్షులు
ఉదయం 9 గంటల తర్వాతే సూపరిండెంటెంట్ తో పాటు మిగిలిన వైద్యాధికారులు ఆస్పత్రికి వ చ్చారు. అందుకు కలెక్టర్, జేసీ, ఆర్డీఓలే సాక్షులు. నిండు ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమైన అధికారులపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విచారణ పేరుతో కలెక్టర్ తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యాధికారుల నిర్లక్ష్యంపై తనతో పాటు జేసీ ప్రత్యక్షసాక్షులుగా ఉంటే ఇక ఆర్డీఓతో విచారణ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి సేవలో జిల్లా వైద్యాధికారి
ఓ వైపు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారికి పట్టలేదు. కనీసం పెద్దాసుపత్రి వై పు కన్నెత్తి చూడకుండా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సేవలో తరించేందుకు రొట్టెల పండగ లో తలమునకలయ్యారు. అధికారులు సకాలం లో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడగలిగేవారు. నెల్లూరులో వందలాది మంది వైద్యు లు నివాసముంటున్నారు. ఉన్నతాధికారులతో పాటు జిల్లా వైద్యాధికారి జిల్లా కేంద్రంలోనే ఉ న్నారు. అధికారులు సీరియస్‌గా స్పందించి ఉం టే అరగంటలోపే వందల మంది డాక్టర్లు పెద్దాసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన విషయం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినా డాక్టర్లను పిలిపించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కలెక్టర్, జే సీ, ఆర్డీఓ ఆస్పత్రిలో ఉన్నారని తెలుసుకున్నా వైద్యాధికారులు నింపాదిగా రావడం దురదృష్టకరం.ఘోరరోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనే ఇలా స్పందిస్తే సాధారణ సమయాల్లో వీరు విధులకు ఏమేరకు హాజరవుతారనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కఠినంగా వ్యవహరిస్తాం : శ్రీకాంత్, కలెక్టర్
విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యాధికారులపై కఠినచర్యలు తప్పవు. పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆర్డీఓ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతా.