వణుకు తగ్గదు.. కునుకు పట్టదు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- మరింత తగ్గే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా చలిగాలులు మరింత గా విజృంభిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికా ర్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మరో నాలుగైదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకోస్తాంధ్ర పరిధిలోకి వచ్చే విశాఖ జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో ఏపీలోకెల్లా అత్యల్పంగా శనివారం 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.
పాడేరు ఘాట్‌లో 3 డిగ్రీలు, చింతపల్లిలో 5, మినుములూరులో 6 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారంతో పోల్చుకుంటే ఇది ఒక డిగ్రీ తక్కువ. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లో 12 డిగ్రీలకంటే తక్కువగా నమోదు కావొచ్చని పేర్కొంది. దక్షిణకోస్తాం ధ్రలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం సాధారణంకంటే కోస్తాంధ్ర, తెలంగాణ ల్లో -5 డిగ్రీలు, రాయలసీమలో ఒక డిగ్రీ (+1) అధికంగాను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అప్రమత్తమైన అధికారులు: ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్, రం గారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలు విభాగాలను ఆదేశించింది.