అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కుక్కలు, పందుల బెడదతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనం బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ప్రజా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో గతంలో ఎన్నోమార్లు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ప్రతి సోమవారం కమిషనర్లు నిర్వహించే ‘ఆత్మీయత’ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం కుక్కలు, పందులకు సంబంధించినవే కావడం గమనార్హం. చిన్నపిల్లలు బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక పందులైతే ఏకంగా ఇళ్లలోకే వస్తున్నా.. వీటి బెడద నుంచి తప్పించేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో పందులు, కుక్కలను నిర్మూలించేందుకు వాటిని చంపించేవారు.
పందులను చంపించే క్రమంలో వాటి పెంపకం దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొన్ని సందర్భాల్లో వారికి వారే గాయాలు చేసుకుని.. మునిసిపల్ సిబ్బంది దాడి చేశారంటూ పోలీస్‌స్టేషన్లలో సైతం కేసు పెట్టారు. దీంతో అధికారులు ఈ ప్రక్రియను మానుకున్నారు. ఇక కుక్కల నివారణలో మరో సమస్య ఎదురైంది. వాటిని చంపడం చట్టరిత్యా నేరం అంటూ కొందరు జంతు ప్రేమికులు కోర్టుకు వెళ్లారు. నోటీసులు రావడంతో ఈ ప్రక్రియనూ నిలిపివేశారు. ఈ రెండూ కాకుండా ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా కుక్కలు, పందుల బెడద తప్పిస్తున్నామని చెబుతున్నారు అనంతపురం నగర పాలక సంస్థ అధికారులు. కాగా, రాత్రి 12 గంటల తర్వాత అనంతపురంలోని రోడ్లపై బైక్‌లో ప్రయాణిస్తే తెలుస్తుంది వారేం సాధించారో!
అనంతలో ఏం చేస్తున్నారు?
పందులు, కుక్కల బెడద నివారణకు అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రాజెక్ట్ వరాహ, ఆపరేషన్ భైరవ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పందుల పెంపకందారుల కుటుంబాలలో విద్యావంతుడైన శ్రీరాములును కో-ఆర్డినేటర్‌గా నియమించి శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం ఎలా చేపట్టవచ్చు అనే విషయంపై పెంపకందారులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు.
పెంపకం కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పందుల పెంపకం జరుగుతోంది. ఈ ప్రక్రియ దశల వారీగా పెంచుతూ పోతున్నారు. కుక్కల బెడద నివారణలో భాగంగా వాటికి సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖ, గుట్టూరుకు చెందిన ఇంటర్ నేషన ల్ అనిమల్ అండ్ బర్డ్స్ వెల్‌ఫేర్ సొసైటీ సంయుక్త సహకారంతో కుక్కలకు ఏబీసీ (అనిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇటీవల మొదలైంది.
పతి రోజు ఆరేడు వీధి కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు జరుగుతున్నాయి. పశువైద్య శాలలోనే ప్రత్యేకంగా షెడ్లు వేయించారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏబీసీ అపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజా శ్రేయసు దృష్ట్యా అన్ని చోట్ల ఇలాంటి పద్ధతిని అనుసరించాల్సిన అవసరం ఆయా ప్రాంతాల అధికారులకు ఉంది. అనంతపురం నగర పరిధిలో వేల సంఖ్యలో పందులు, కుక్కలు ఉన్నాయి.
ప్రాథమిక అంచనా ప్రకారం ఇక్కడ 75 వేలకు పైగా పందులు, 14 వేల వరకు కుక్కలు ఉన్నట్లు నిర్దారించారు. ఇటీవలే అనంతపురంలో ఓ బాలుడిపై పంది భీకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా 50-60 మంది కుక్క కాటుకు గురవుతున్నారంటే పరిస్థితి ఎలాగుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుక్క కాటు కేసు రాని రోజంటూ లేదు.
ఇంత అధ్వానమా..
Published Sun, Dec 22 2013 4:14 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement