భౌభత్సం!
రెచ్చిపోతున్న శునకాలు
- ఎక్కడపడితే అక్కడ మాంసం వ్యర్థాలు
- వైరస్ బారిన పడుతున్న కుక్కలు
- నియంత్రణ చర్యలు చేపట్టని అధికారులు
- జిల్లా కేంద్రంలో బుధవారం ఐదుగురికి కుక్కకాటు
- రాత్రిళ్లు బయట తిరగాలంటేనే భయం
- వణికిపోతున్న ప్రజలు
గత ఆరు నెలల్లో మండలాల వారీగా నమోదైన కుక్క కాటు కేసులు
మొత్తం కేసులు : 23, 272
గుంతకల్లు - 956
గుత్తి - 614
తాడిపత్రి - 1070
పామిడి - 512
గార్లదిన్నె - 759
ఉరవకొండ - 903
రాయదుర్గం - 710
కుందుర్పి - 560
కళ్యాణదుర్గం - 531
నార్పల - 463
రామగిరి - 569
సీకే పల్లి - 547
ధర్మవరం - 1505
ముదిగుబ్బ - 424
కదిరి - 925
గోరంట్ల - 543
పుట్టపర్తి - 556
పెనుకొండ - 749
మడకశిర - 751
హిందూపురం - 1621
ఏ సందు చూసినా కుక్కలే. ఏ ఊరికి వెళ్లినా కుక్క కాటు బాధితులే. రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. పట్టణ ప్రాంతాలు మొదలు.. పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క అనంతపురం సర్వజనాసుపత్రికే ప్రతి నెలా 400 వరకు కుక్కకాటు కేసులు వస్తున్నాయంటే శునకాల వీర విహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అధికారులు శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతోనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అనంతపురం మెడికల్ : రాత్రయితే చాలు కుక్కలు గుంపులుగా రోడ్ల మీదకు చేరి బెంబేలెత్తిస్తున్నాయి. వాహన చోదకులను సైతం వెంబడించి మరీ కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాల మీద నుంచి కింద పడి చాలా మంది గాయాలపాలవుతున్నారు. మాంసం వ్యాపారులు వ్యర్థాలను ఇష్టారీతిన పట్టణ, నగర శివార్లలో పడేస్తుండటంతో వీటిని తిని కుక్కలు పిచ్చిగా ప్రవరిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, తాడిపత్రి పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. బుధవారం ఉదయం అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న సోమశేఖర్(12), మల్లేశ్వర రోడ్డుకు చెందిన వేణుగోపాల్ రావు(47), వినాయకనగర్‌కు చెందిన శ్రీరాం(8), మారుతినగర్‌కు చెందిన కార్తీక్(2), బుడ్డప్పనగర్‌కు చెందిన ముంతాజ్(40)లు కుక్కల దాడిలో గాయపడి సర్వజన్పాత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. పాలనా యంత్రాంగం మేల్కొనకపోవడం గమనార్హం.
వ్యాక్సిన్లు వేయకే వీరవిహారం
జిల్లాలో వీధి, పెంపుడు కుక్కలు 80వేల వరకు ఉంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో పెంపుడు కుక్కలకు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. వాటి యజమానులు తీసుకురావడంతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. గతంలో మునిసిపల్ అధికారుల సహాయంతో పశు వైద్యులు శునకాలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించేవారు. ఏళ్లు గడుస్తున్నా వాటికి వ్యాక్సిన్ ఇవ్వకపోవడంతో వైరస్ బారిన పడి వీరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ, మునిసిపల్ సిబ్బంది శునకాలను పట్టుకునేందుకు భయపడుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు
కుక్కలు కరచినప్పుడు గాయాల స్థాయిని బట్టి చికిత్స అందిస్తారు. కాళ్లు, చేతులకు మామూలు గాయాలైతే గ్రేడ్–1, 2గా గుర్తిస్తారు. కండరాలను లాగితేగ్రేడ్–3గా, ఎముకలకు గాయమైతే గ్రేడ్–4గా పరిగణిస్తారు. కుక్కకాటుకు గురైన వారికి వెంటనే యాంటీ రేబిస్ టీకా ఇస్తున్నారు. తీవ్రగాయాలైన వారికి యాంటీ రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్ టీకా వేయాల్సి ఉంటుంది. జిల్లాలో 80 పీహెచ్‌సీలు, 15 సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, అనంతపురం సర్వజనాస్పత్రి ఉన్నాయి. అన్ని చోట్లా వ్యాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిక్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఒకవేళ ఎక్కడైనా అయిపోతే వెంటనే ఇండెంట్ పెడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు తెలిపారు.
చికిత్సలో నిర్లక్ష్యం వద్దు
కుక్క కరిచాక ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. అది ప్రాణాపాయం. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంది. సద్వినియోగం చేసుకోండి. నిర్దేశిత సమయానికి వచ్చి టీకాలు వేయించుకోండి.
- డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ