
సాక్షి, కృష్ణా: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడమంటే అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వంద వసంతాల వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయడం ద్వారా బ్రాంచీలు మూతపడి ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాగా ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్‌ఐసీ, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని దోనెపూడి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment