సాక్షి, విజయవాడ: కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. విజయవాడ దాసరి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి 8న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ చేపడుతున్నామని వెల్లడించారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు కూడా సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రంలో కూడా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీర్మానం చేయాలని కోరారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. వామపక్ష పార్టీలతో పాటు కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేయనున్నామని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ కుదేలు..
బీజేపీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కోట్లాది కార్మికుల భద్రత కోసం జనవరి 8న దేశవ్యాప్త బంద్ చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగ సమస్య జఠిలమైందన్నారు. ఉద్యోగ కల్పన చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 200 రైతు, రైతు కూలీ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment