donepudi shankar
-
‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’
సాక్షి, కృష్ణా: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడమంటే అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని సీపీఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వంద వసంతాల వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయడం ద్వారా బ్రాంచీలు మూతపడి ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాగా ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని దోనెపూడి పేర్కొన్నారు. -
బొండాపై కేసు నమోదు చేయాలి
హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో అన్ని రాజకీయపార్టీలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని సమావేశం తీర్మానించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో భూ కబ్జాల నివారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నగరంలో భూ కబ్జాలు పెరిగాయన్నారు. అధికారపార్టీ నేతలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ కబ్జాదారులను ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు. శంకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా చేసిన విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉమా నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమా భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా విషయంలో ఎమ్మెల్యేను నిందితునిగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు సమర్థిస్తూ తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అధికార కబ్జాలకు పాల్పడుతుందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా దురాగతాలపై తమ పోరాటం ఆగదన్నారు. సమావేశంలో న్యాయవాది సీహెచ్ రవీంద్రారెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్పి గ్రిటన్, సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, సీఐటీయూ నాయకులు కె.దుర్గారావు, సీపీఎం నాయకుడు దోనేపూడి కాశీనాథ్, మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గాంబ, ఓర్సు భారతి, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, యువజన సమాఖ్య, ప్రజానాట్య మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. -
విజయవాడ మేయర్ శ్రీధరా.. నారాయణా..?
విజయవాడ : నగర మేయర్ కోనేరు శ్రీధరా? మంత్రి నారాయణ? అర్థం కాని పరిస్థితి నెలకొందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఎద్దేవా చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిల్‌తో నిమిత్తం లేకుండా మంత్రి నారాయణ నీటి మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మీటర్ల ఏర్పాటుకు అధికారులు హడావిడి చేస్తున్నా మేయర్ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నీటిమీటర్లను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన టీడీపీ అధికారంలోకి రాగానే తన నిజస్వరూపం బయటపెట్టిందన్నారు. ప్రజలు సమస్యలతో విలవిలలాడుతుంటే కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతవరకు సబబని దోనేపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖ సారాంశాన్ని చదివి వినిపించారు. నగర పాలక సంస్థ రూ.350 కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్లానింగ్, నాన్‌ప్లానింగ్ గ్రాంట్ రాబట్టాలని డిమాండ్ చేశారు. పల్లా సూర్యారావు పాల్గొన్నారు.