సమావేశంలో మాట్లాడుతున్న దోనేపూడి శంకర్
హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఈనెల 25వ తేదీలోగా పోలీసులు కేసు నమోదు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో అన్ని రాజకీయపార్టీలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని సమావేశం తీర్మానించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో భూ కబ్జాల నివారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నగరంలో భూ కబ్జాలు పెరిగాయన్నారు. అధికారపార్టీ నేతలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ కబ్జాదారులను ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు. శంకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా చేసిన విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు.
ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉమా నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమా భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుని భూమి కబ్జా విషయంలో ఎమ్మెల్యేను నిందితునిగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు సమర్థిస్తూ తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అధికార కబ్జాలకు పాల్పడుతుందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా దురాగతాలపై తమ పోరాటం ఆగదన్నారు. సమావేశంలో న్యాయవాది సీహెచ్ రవీంద్రారెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్‌పి గ్రిటన్, సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, సీఐటీయూ నాయకులు కె.దుర్గారావు, సీపీఎం నాయకుడు దోనేపూడి కాశీనాథ్, మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గాంబ, ఓర్సు భారతి, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, యువజన సమాఖ్య, ప్రజానాట్య మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment