సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోక ముందే చంద్రబాబునాయుడు ఆయన మీద కమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆదాలకు ఉన్న పరిచయాల దృష్ట్యా రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లు కూడా చీల్చుతారని ‘బాబు’కు ఆందోళన పట్టుకుంది. దీంతో సోమవారం ఆదాలకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని హుకుం జారీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడాలని ఆదాల ప్రభాకరరెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి కూడా ఇదే బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ కూడా సమైక్యాంధ్ర విషయంలో గో..పి (గోడమీద పిల్లి) రాజకీయం చేస్తోంది. ఈ కారణం వల్ల ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోననే అనుమానంతోనే ఆ ఇద్దరు టీడీపీలో చేరికకు తొందరపడకుండా అక్కడ కర్చీఫ్ మాత్రమే వేసి ఉంచారు.
మరోవైపు కొత్తపార్టీ కదలికలు కనిపిస్తుండటంతో చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే సైకిలెక్కాలని ఎమ్మెల్యేలిద్దరూ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలు రావడం, ఆదాల అనూహ్యంగా రంగంలోకి దూకడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆదాలకు టీడీపీ నేతలతో ఉన్న సత్సంబంధాలు, ఆయన ఆర్థిక బలం తమ పార్టీ ఓట్లను కూడా చీల్చుతుందని ఆ పార్టీ అభ్యర్థులు కంగారుపడుతున్నారు. ఈ ప్రమాదం వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ ముఖ్య నేతలు కొందరు చంద్రబాబు చెవిలో కూడా ఊదారని తెలిసింది.
దీంతో బాబు నష్ట నివారణ కోసం నేరుగా రంగంలోకి దిగారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. సోమవారం సాయంత్రం చంద్రబాబు నేరుగా ఆదాలకు ఫోన్ చేసి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని, లేదంటే తమ ఓట్లు చీలే అవకాశం ఉందని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా పార్టీలోనే చేరని తనకు అప్పుడే ఆదేశాలు ఇచ్చే పరిస్థితితో మొదట కాస్త కంగారు పడిన ఆదాల వెంటనే తేరుకుని తాను ఎన్నికల నుంచి తప్పుకునేది లేదని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను సమైక్యాంధ్ర నినాదంతోనే బరిలోకి దిగానని, కాంగ్రెస్ ఓట్ల మీదే గురిపెడతానని సర్ది చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి సహకరిస్తారా? :
కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చి సమైక్యాంధ్ర నినాదంతో ఆదాలను గెలిపించుకోవాలనే ఆలోచనతో సీఎం కిరణ్ ఆయన్ను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఫ్ ది రికార్డ్ మాటల్లో ఆదాల కూడా ఎమ్మెల్యేల వద్ద ఇదే విషయం చెబుతున్నారని వినికిడి. రకరకాల మార్గాల్లో తాను 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను సమీకరించుకుంటే మిగిలిన వారిని సీఎం కిరణే సర్దుబాటు చేసి తన విజయానికి బాటలు వేస్తారని ఆదాల గట్టిగా నమ్ముతున్నారు.
అయితే కాంగ్రెస్ హై ‘‘కమాండ్’’ ఫలితంగా సీఎం కిరణ్ ఆదాలకు ఎమ్మెల్యేలను సమకూరుస్తారా? లేక తనను సీఎం చేసిన సోనియాగాంధీతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఉంటాయని చివరి నిముషంలో హ్యాండిస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అటు టీడీపీ నుంచి నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి తన ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, సీఎం ధైర్యంగా ఎమ్మెల్యేలను ఇవ్వలేకపోతే ఆదాల పరిస్థితి ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
బరిలోంచి తప్పుకో..
Published Wed, Feb 5 2014 3:24 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement