సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీలో కొంతకాలంగా తెరచాటుగా నలుగుతున్న అంతర్గత విభేదాలు గురువారం మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కట్టడి చేయడానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేస్తున్న పాచికలు కొత్త వివాదానికి తెరలేపాయి. దీంతో తెలుగుదేశం కాస్త విభేదాల దేశంగా మారింది. జిల్లా పార్టీలో సోమిరెడ్డి ఆధిపత్యానికి పూర్తిగా చెక్‌పెట్టడానికి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఈ వివాదం మరింత ముదరడంతో మార్చి 2వ తేదీన జరగాల్సిన ప్రజాగర్జన సభ 5వ తేదీకి వాయిదా పడింది.
ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో సోమిరెడ్డికి ఆయనకు ఆధిపత్యపోరు నడిచింది. అప్పట్లో సోమిరెడ్డి ఆధిపత్యం నడవడంతో ఆదాల పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ కోపంతోనే 2004 ఎన్నికల్లో ఆదాల సర్వేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సోమిరెడ్డిని ఓడించారు. 2009 ఎన్నికల్లో కూడా ఆదాల తన ఆధిపత్యం చాటుకున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావాలనుకున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించి తన మద్దతుదారులైన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డికి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కూడా టికెట్లు దాదాపుగా ఖరారు చేయించగలిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదాల వర్గం చేరికను జీర్ణించుకోలేని సోమిరెడ్డి కోవూరు, నెల్లూరురూరల్ నియోజకవర్గాల్లో తాను సూచించిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకునేలా రాజకీయం నడుపుతున్నారు. మార్చి 2వ తేదీ ఆదాల వర్గం పార్టీలో చేరికకోసం నిర్వహించాలనుకున్న ప్రజాగర్జన సభ టీడీపీలో ముసలం పుట్టించింది.
సభ ఎవరు పెడుతున్నారు? తామెందుకు జన సమీకరణ చేయాలనే దిశగా ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా గర్జన సభ జరిపితే దాన్ని విజయవంతం చేయడం ఇబ్బందవుతుందని ఆదాల వర్గం అంచనా వేసింది. దీంతో గురువారం ఆదాల ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడును కలిశారు. జిల్లాలో సోమిరెడ్డి తమకు వ్యతిరేకంగా రాజకీయం నడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.
కోవూరు టికెట్‌తోపాటు ఉదయగిరి టికెట్ ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డికి, ఆత్మకూరు టికెట్ తాము సూచించే వ్యక్తికి, నెల్లూరురూరల్ టికెట్ ఆనం జయకుమార్‌రెడ్డికి కేటాయిస్తే తాను గెలిపించి తీసుకువస్తానని చంద్రబాబుకు ఆదాల హామీ ఇచ్చారని తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు ఇప్పటికే వసూళ్లకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గానికే పరిమితం చేసి అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద గెలిచి రావాల్సిందిగా సూచించాలని ఆదాల విన్నవించినట్లు తెలిసింది.
నెల్లూరు లోక్‌సభ పరిధితోపాటు నెల్లూరురూరల్ టికెట్లు గెలిచేవారికే ఇస్తే ఎంపీగా తాను కూడా తప్పకుండా గెలుస్తానని ఆదాల అధినేతకు గట్టిగా చెప్పారని సమాచారం. సుమారు గంటన్నరపాటు సాగిన ఈ చర్చల అనంతరం ప్రజాగర్జన సభను 5వ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆ లోగా సోమిరెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వలస రాబోతున్న నాయకులందరితో చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తానని చంద్రబాబు ఆయనకు సూచించారు.
ప్రజాగర్జన విషయమై జిల్లా నేతలతో చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్‌స నిర్వహిం చారు. విభేదాలు వీడి భారీ జనసమీకరణపై దృష్టి సారించాలని నేతలకు బాబు సూచించారు. కాగా కోవూరు టికెట్ కోసం సోమిరెడ్డి సిఫారసు చేస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రత్యామ్నాయంగా నెల్లూరురూరల్ టికెట్ కూడా లేకుండా చేయడానికే ఆనం జయకుమార్‌రెడ్డిని ఆదాల తెరమీదకు తెచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభ్యర్థుల వ్యవహారంలో కూడా ఆదాల పైచేయి సాధించేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు పార్టీలో నలుగుతున్న విభేదాలను మరింత తీవ్రం చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బాబును మర్యాదపూర్వకంగా కలిశా: ఆదాల
ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. రాజకీయాలు మాటా ్లడలేదన్నారు. మీడియాలో రకరకాలుగా జరు గుతున్న ప్రచారమంతా ఊహాజనితమన్నారు.
విభేదాల టీడీపీ
Published Fri, Feb 28 2014 2:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement