విభజనపై ఎవరి వాదన వారిదే: బొత్స | Don't questioned me on state division: Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

విభజనపై ఎవరి వాదన వారిదే: బొత్స

Published Tue, Dec 3 2013 4:14 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

విభజనపై ఎవరి వాదన వారిదే: బొత్స - Sakshi

విభజనపై ఎవరి వాదన వారిదే: బొత్స

సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణవాళ్లు విభజనను సమర్థిస్తూ మాట్లాడతారు. సీమాంధ్ర వారు విభజనను వ్యతిరేకిస్తారు. మేం మాత్రం హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వివరిస్తాం’’ అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా ఉన్న మీరు హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కరెక్టేనా? అని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై మీరు కాదు నన్ను ప్రశ్నించాల్సింది. మా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ అడిగితే సమాధానం చెబుతా. ఇది మా పార్టీ అంతర్గత విషయం. మీరు అడగాల్సిన అవసరంలేదు.  ఇదే విషయం రాసుకోండి’’ అని సమాధానమిచ్చారు.

అంతకుముందు బొత్స రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ‘‘తెలంగాణలోని నాయకులంతా విభజనకు అనుకూలంగా మాట్లాడండి. సీమాంధ్ర నేతలంతా సమైక్యంగా ఉండాలని చెప్పండి. తద్వారా ఇరు ప్రాంతాల్లో ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించండి. రాష్ట్రం విడిపోయినా, సమైక్యంగా ఉన్నా పార్టీని గెలిపించే దిశగానే మనం పనిచేయాలి. ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌కే సాధ్యమని చెబుతూ ప్రజలను నమ్మించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని పార్టీ కార్యదర్శులకు బొత్స దిశానిర్దేశం చేశారు. ‘‘2014 ఎన్నికలు కాంగ్రెస్‌కు కచ్చితంగా సవాలే. దీనిని స్వీకరించే అవకాశం మనకు రావడం కూడా ఓ సవాలే. అర తమాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే లేదనుకోవద్దు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉంది. వారిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా కృషి చేయాలి’’ అని బొత్స వారికి సూచించారు.
 
 పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు..
 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బొత్స సోమవారం పీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించారు. సోషల్ మీడియా, మీడియా మేనేజ్‌మెంట్, పబ్లిసిటీ టీం, ఎలక్షన్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ అనాలసిస్, సర్వే పేరిట మొత్తం ఐదు కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఐదు నుంచి ఏడుగురు సభ్యులను నియమించారు. పీసీసీ అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ఆ కమిటీల్లో నియమించారు.
 
మీడియా మేనేజ్‌మెంట్ కమిటీ
పీసీసీ అధికార ప్రతినిధులు మహేష్‌కుమార్‌గౌడ్, సీహెచ్ ఉమేశ్‌రావు, జంగా గౌతమ్, కాట్రగడ్డ ప్రసూన, డి.అనురాధ, టి.కల్పనారెడ్డితోపాటు పీసీసీ కార్యదర్శి నేతి శ్యాంసుందర్.  సోషల్ మీడియా: పీసీసీ కార్యదర్శులు దిలీప్ సి.బైరా, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అనిత జక్కని, ఎన్.దిలీపాచారి, చరణ్‌జోషి, మద్దుల గాల్‌రెడ్డి.
 
పోల్ మేనేజ్‌మెంట్:
మర్రి ఆదిత్యారెడ్డి, నందిమండలం వేణు, బోయినపల్లి కృష్ణమూర్తి, ఎస్వీ సుధీర్, కొణిదల ఇందిర.
 
రీసెర్చ్ అనాలసిస్, సర్వే కమిటీ
ఎ. శ్రీరాంయాదవ్, ఎన్. పద్మావతిరెడ్డి, వి. శ్రీరాంనాయక్, జయదేవ్ గల్లా, కె.కృష్ణ, జి.రఘునందన్‌బాబు.  ఎన్నికల ప్రచార, వ్యూహ కమిటీ: ఎస్.జగదీశ్వర్‌రావు, ఎన్.కరణ్‌గౌడ్, గున్నం రాంబాబు, ఆర్.స్వామినాయుడు, కేబీఎస్ శివాజీ, ఎస్.మాధవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement