
రెండు ప్రాంతాల నేతలతో భేటీ కానున్న బొత్స
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రక్రియపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) రాసిన లేఖపై ఏం చెప్పాలనే అంశంపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం వేర్వేరుగా భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే అఖిలపక్ష సమావేశంలో వెల్లడించాల్సిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ, సాయంత్రం 4.30 గంటలకు సీమాంధ్ర నేతలతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అవుతారు. విభజన ప్రక్రియపై తగిన సలహాలు, సూచనలివ్వాల్సిందిగా కేంద్రహోంశాఖ గత నెల 30న అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో అదే విషయాన్ని బొత్స ఎదుట కూడా చెప్పాలని ఆయా నేతలు నిర్ణయించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అవసరం లేదని, 3 నుంచి 5 ఏళ్లకే పరిమితం చేయాలని, సరిహద్దులు కూడా మార్చాల్సిన అవసరం లేదని సూచించనున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధి మేరకు శాంతిభద్రతల అంశాన్ని కేంద్రం పర్యవేక్షించినా తమకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని స్పష్టం చేయనున్నారు. బచావత్ ట్రిబ్యునల్ మేరకు నీటి వనరుల పంపకం జరపాలని, అదే విధంగా తెలంగాణతోపాటు సీమాంధ్రలోనూ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ తరపున ఒక్కరిని మాత్రమే పంపడంతోపాటు సీడబ్ల్యూసీ తీర్మానాన్నే పార్టీ అభిప్రాయంగా చెప్పాలని కోరనున్నారు. విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెల్లడిం చేందుకు పార్టీ తరపున పీసీసీ చీఫ్ వెళ్లడమే సరైనదనే భావనను వ్యక్తం చేయనున్నట్టు తెలిసింది. అయితే తాను వ్యక్తిగతంగా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెబుతున్న బొత్స అఖిలపక్ష సమావేశానికి వెళతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. సమైక్య వాదాన్ని విన్పిస్తున్న తాను అఖిలపక్ష సమావేశానికి వెళ్లి విభజన నిర్ణయాన్ని వెల్లడిస్తే ఇబ్బందికరంగా ఉంటుందనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమైనందున విభజన కోసం జరిగే అఖిలపక్ష సమావేశంపై స్పందించాల్సిన అవసరమే లేదని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఇటీవల వెల్లడించినందున సీఎం, బొత్సతో జరిగే భేటీలో జీవోఎం లేఖను, అఖిలపక్ష సమావేశాన్ని వ్యతిరేకించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే సీమాంధ్ర నేతల్లో ఈ అంశంపై విభేధాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
విభజన ప్రక్రియ అనివార్యమైన నేపథ్యంలో సమైక్య వాదనను పక్కనపెట్టి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించడమే మేలని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రకు దక్కాల్సిన ప్రయోజనాలపై సీరియస్‌గా దృష్టి సారిం చాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య వాదం పేరుతో సీఎం సహా సీమాంధ్ర నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మంత్రులు ఆనం , రఘువీరా, బాలరాజు, కొండ్రు తదితరులు విభజన అమలు అనివార్యమైన నేపథ్యంలో జీవోఎం లేవనెత్తిన అంశాలపై స్పందించి సీమాంధ్రకు కావాల్సిన ప్రయోజనాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర నేతల భేటీకి హాజరవుతున్న సీఎం తెలంగాణ నేతల భేటీకి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. విభజన విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వీరెవరూ కిరణ్‌ను కలిసేందుకు ఆసక్తి చూపకపోవడంవల్లే బొత్స వారితో భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రపతితో భేటీ కానున్న టీ మంత్రులు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనను కలవాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. రాత్రి 8.30 గంటలకు ఈ మేరకు రాష్ట్రపతి అపాయిట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజనకు సంబంధించి సీఎం కిరణ్ ఇటీవల రాష్ర్టపతికి లేఖ రాసిన నేపథ్యంలో దానికి ధీటుగా రూపొం దించిన లేఖను వారు ప్రణబ్‌కు అందజేయనున్నట్లు తెలిసింది.