వంద పేజీలు మెయిల్ చేశా: బొత్స
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) విభజన ప్రక్రియను ఆపాలని ఆకాంక్షిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. విభజన పక్రియ నేపథ్యంలో జీవోఎం పేర్కొన్న అంశాలపై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్ర బృందానికి మెయిల్ చేసినట్లు తెలిపారు.
మంగళవారం సాయంత్రం తన నివాసంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ విభజన ప్రక్రియ అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నేతల పేర్కొన్న అభిప్రాయాలతో రూపొందించిన వంద పేజీల నివేదికను డిప్యూటీ సీఎం తనకు అందజేశారన్నారు. అదే విధంగా సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నేతలు వ్యక్తపరిచిన అభిప్రాయాలతోపాటు గతంలో హైకమాండ్‌కు రాసిన లేఖలను జతచేసి మొత్తం 10 పేజీల నివేదికను మంత్రి శైలజానాథ్ తనకు అందజేశారని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని అందులో పేర్కొన్నట్లు తెలిపారు.