సీడబ్ల్యూసీ ‘విభజన’ నిర్ణయం శిరోధార్యం: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానమే తమకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు వినిపిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన బొత్స బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తొలి నుంచి ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు చెబుతున్నారని, ఇప్పటికీ ఎవరూ మాట మార్చలేదన్నారు. అఖిలపక్షంలో కూడా అదే వాదనలను వినిపించామని చెప్పారు.
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ తమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను వినిపిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ప్రాంతాల వారీగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు చెబుతారన్నారు. అసెంబ్లీలో బిల్లుపై మెజార్టీ, మైనార్టీ అనేది ఏమీ ఉండదని, విప్ కూడా ఉండదని చెప్పారు. కేంద్ర మంత్రి షిండేను తాను రహస్యంగా కలవలేదని, అందరి ఎదుట రాష్ట్రానికి రావలసిన తుపాను సహాయక నిధులు విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చానని తెలిపారు.
జీవోఎం ముందుకు రావాలని తనను పిలవలేదని, పిలిస్తే వెళ్తానన్నారు. ముఖ్యమంత్రికి జీవోఎం నుంచి పిలుపు వచ్చిన విషయం తనకు తెలియదన్నారు. జీవోఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన నివేదిక గురించి ప్రస్తావించగా అలాంటి నివేదిక పంపినట్లు తనకు తెలియదని చెప్పారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, అది కేంద్రం పరిధిలో విషయమని అన్నారు.