రాజీనామా బాటలో డీలర్లు
గుడివాడ డివిజన్‌లో 13 మంది రాజీనామా
ఈ-పోస్‌తో బెంబేలు
రాబడికి, ఖర్చుకు పొంతన లేదని ఆవేదన
గుడివాడ : రేషన్ డీలర్లు పరేషాన్ అవుతున్నారు. రేషన్ షాపులు మాకొద్దు బాబోయ్ అంటూ రాజీనామా బాట పడుతున్నారు. గుడివాడ డివిజన్‌లో నెల రోజుల వ్యవధిలో 13 మంది తమ డీలర్‌షిప్ రద్దుచేయాలని కోరుతూ రాజీనామా లేఖలు పంపారు. రేషన్ డీలర్లు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఇదే ప్రథమం అని చెబుతున్నారు. ఈ-పోస్ విధానం అమలు చేసిన ప్రభుత్వం తమ కమీషన్‌పై ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవటమే ఇందుకు కారణమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలంతా కష్టపడినా పైసా ఆదాయం లేని ఈ డీలర్‌షిప్‌లు మాకెందుకని వారంటున్నారు.
రాజీనామాల బాట...
గుడివాడ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 349 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వారిలో అనారోగ్య కారణాలు చూపుతూ 13 మంది రేషన్‌షాపు రద్దు చేయాల్సిందిగా దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు ఎనిమిది ఆమోదించగా, మరో ఐదు దరఖాస్తులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రాజీనామాలను ఆమోదించినవారిలో గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, కైకలూరు మండలాల్లో ఇద్దరేసి చొప్పున ఉన్నారు.
ఈ-పోస్ వల్లే...
ఈ-పోస్ విధానం అమలులోకి తెచ్చిన ప్రభుత్వం డీలర్లకు కమీషన్ పెంచటంలో శ్రద్ధ చూపటం లేదని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. తాము విక్రయించే సరకుల్లో కేజీ బియ్యానికి 20 పైసలు, కేజీ పంచదారకు 50 పైసలు, లీటరు కిరోసిన్‌కు 25 పైసలు, కేజీ కందిపప్పుకు 55 పైసలు, కేజీ గోధుమలకు 13 పైసలు చొప్పున డీలర్లకు కమీషన్ వస్తుంది. ఇవిగాక మిగిలిన ఖాళీ సంచులు అమ్ముకునే అవకాశం ఉంది. వీటన్నింటిని లెక్కగట్టినా ప్రస్తుత పరిస్థితిలో ఏమి మిగలటం లేదని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఇందులోనే షాపు అద్దె, కరెంటు బిల్లు, సహాయకుడి జీతం ఇవ్వాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇవిగాక హమాలీల కూలి ఇవ్వాలని, ఇవన్నీ పోతే ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీలర్లకు కమీషన్‌దీనిపై ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్లుకు కమీషన్ పెంచే విధానం ఆలోచించాలని కోరుతున్నారు.
మాకొద్దీ రేషన్ షాపులు!
Published Fri, Feb 5 2016 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement