రాజీనామా చేయకుంటే కేసులు పెడతారా?
* డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి
* మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు
* ఇలాగే ఉంటే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా
* మార్కాపురం రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే జంకె హెచ్చరిక
మార్కాపురం : ‘వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న రేషన్ డీలర్లు రాజీనామా చేయకుంటే అక్రమ కేసులు బనాయిస్తారా..? మార్కాపురం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు డీలర్ల ఇళ్లకు వెళ్లి రికార్డులు ఇవ్వమని వారిని వేధిస్తున్నారు. ఇదీ మంచి పద్ధతి కాదు. డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి.
మా మంచితనాన్ని చేతగాని తనంగా భావించొద్దు’ అని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ఎంపీపీ మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డితో కలిసి వచ్చిన ఆయన.. తహశీల్దార్‌తో సుదీర్ఘంగా మాట్లాడారు.
రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల రేషన్ డీలర్ విషయంలో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి రెవెన్యూ అధికారులు వారు చెప్పినట్టు చేశారని, తామేమీ చూస్తూ ఊరుకోమని, అవసరమైతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.
విజిలెన్స్ డీటీ, ఆర్‌ఐల ఏకపక్ష నిర్ణయాలు, వారు ప్రజాప్రతినిధులపై చేస్తున్న విమర్శలపై కలెక్టర్, మంత్రితో పాటు హైదరాబాద్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఏ తప్పూ చేయకున్నా చింతగుంట్ల డీలర్‌పై కేసులు అక్రమంగా బనాయించారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం తనిఖీలకు వెళ్లిన అధికారులు రికార్డులను అక్కడే పరిశీలించాలని, తమ ఇంటికి తీసుకెళ్లడం ఎక్కడా లేదన్నారు.
అలా చేయడం వల్ల రికార్డులు తారుమారు కావన్న గ్యారంటీ ఏమిటన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రెవెన్యూ అధికారుల తీరు వివాదాస్పదంగా మారిందని, ఒక్కసారి పునరాలోచించుకుని మనస్సాక్షిగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే జంకె హితవు పలికారు. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం ఉద్యోగాలు చేయవద్దని, పేద ప్రజల సంక్షేమం కోసం విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు.
జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి మాట్లాడుతూ దరిమడుగులో షాపు నంబర్ 19కు కేటాయిస్తున్న నిత్యావసరాలను అనధికార వ్యక్తి విక్రయిస్తున్నాడని, ఈ విషయాన్ని గతంలో చెప్పినా ఎందుకు విచారణ చేపట్టలేదని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. తహశీల్దార్ నాగభూషణం మాట్లాడుతూ తాము ఎవరి ప్రలోభాలకూ లొంగలేదని, దరిమడుగు డీలర్‌పై తానే స్వయంగా విచారణ చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.