దొంగ .. దొంగా దొరకవేం..! | .. .. Dorakavem thief thief! | Sakshi
Sakshi News home page

దొంగ .. దొంగా దొరకవేం..!

Published Sun, Jan 11 2015 3:06 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

దొంగ .. దొంగా దొరకవేం..! - Sakshi

దొంగ .. దొంగా దొరకవేం..!

ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తాం... అటు అటవీశాఖ అటు పోలీసులు రోజుకొక్కసారైనా చెబుతున్న మాట. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి స్మగ్లింగ్ నిరోధిస్తామని పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన.. ఎవరెన్ని చెప్పినా... దొరికితే కదా దొంగలం అనే తరహాలో పలువురు స్మగ్లర్లు దర్జాగా తిరిగుతున్నారు. నిత్యం వందలాది కేసులు నమోదు అవుతుండగా పొట్టకూటికోసం వచ్చిన కూలీలు, చిన్నచిన్న దొంగలు తప్ప బడా దొంగలను పట్టుకున్నది తక్కువే. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

కొంద మంది మీద అసలు కేసులు ఉన్నట్లే అధికారులు మరిచిపోయూరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో త్వరలో పట్టుకుంటామనే ప్రకటనలు తప్ప వాస్తవం అందుకు విరుద్ధం. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న నిందితుల్లో అటవీశాఖ అధికారులు కొందరిని అదుపులోకి తీసుకున్నా పలువురు పారిపోయూరు. ఒక్క ప్రొద్దుటూరు డివిజన్‌లోనే ఇలా కేసులు నమోదైన సుమారు 40 మంది నిందితులను అధికారులు ఏళ్లుగా చేయలేదు.

అటవీశాఖ అధికారులు వారిపై కనికరం చూపిస్తున్నారో.. లేక విశ్వాసం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ కార్యాలయానికి వచ్చిన కర్నూల్ కన్జర్వేటర్ శాంతిప్రియాపాండే రికార్డుల్లో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇంత వరకూ అధికారులు పాత నిందితులను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు.
 
ప్రొద్దుటూరు బీట్‌లోనే 40 మంది స్మగ్లర్‌లు..
ప్రొద్దుటూరు ఫారెస్ట్ బీట్‌లో 2006 నుంచి 2014 వరకూ 121 మందిపై సుమారు 30 ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి.   వారిలో కేవలం 81 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. మిగిలిన వారిలో ఒక్కరిని కూడా గత 7-8 ఏళ్ల నుంచి అరెస్ట్ చేయలేదు. ఉన్నతాధికారులు ఎన్నిమార్లు దీనిపై ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదు. అడపాదడపా బీట్‌ల తనిఖీలు, శాఖాపరమైన సమావేశాలకు హాజరు కావడంతో సరిపెడుతున్నారు.
 
మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్‌లు సునీల్, రామనాథ్‌రెడ్డి..
అంతర్జాతీయ స్మగ్లర్ రామనాథరెడ్డి, ఇటీవల పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న కిడ్నాపర్ మండ్ల సునీల్‌లపై ఎర్రచందనం కేసులు ఉన్నాయి. 2010లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా సునీల్ గ్యాంగ్ రూరల్ పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న వారిలో దొర్నిపాడు శివ, రేవనూరు రామిరెడ్డి ఉన్నారు.

పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించగా అటవీశాఖ అధికారులు 82/2010-11 ఓఆర్ నెంబర్ కింద కేసు నమోదు చేశారు. అలాగే 2012లో మడూరు రోడ్డులో పోలీసులు రామనాథరెడ్డి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. ప్రధాన స్మగ్లర్ అయిన రామనాథరెడ్డితో పాటు బద్వేల్ శ్రీను, మునెయ్య, చెండ్లూరు ప్రసాద్, శంకర్ దొరకలేదు. దీనిపై అటవీశాఖ అధికారులు 24-ఎ/2012-13 ఓఆర్ నెంబర్ కింద కేసు నమోదు చేశారు. 2012లో కూడా రామనాధరెడ్డిపై ఎర్రచందనం కేసు నమోదు అయింది.

ఓఆర్ నెంబర్ 60/2011-12 కేసులో రామనాథరెడ్డితో పాటు ప్రొద్దుటూరులోని కొంపలపుల్లన్న వీధిలో ఉంటున్న నవాబ్‌బాషాలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవలే రామనాథరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా వివిధ కేసుల్లో రిమాండులో ఉన్న మండ్ల సునీల్‌ను అధికారులు ఇంత వరకూ పిటి వారెంట్‌పై తీసుకు వచ్చి కోర్టులో హాజరు పరచిన దాఖలాలు లేవు. గత ఏడాది ముద్దనూరు రేంజ్‌లో కేసు నమోదు కాగా అక్కడి అటవీశాఖ అధికారులు పీటీ వారెంట్‌పై సునీల్‌ను కోర్టులో హాజరు పరిచారు. కానీ ఇక్కడి అధికారులు సునీల్‌పై కేసు ఉన్న విషయాన్నే మరచిపోయారనిపిస్తోంది.
 
దర్జాగా తిరుగుతున్న స్మగ్లర్లు..
పరారీలో ఉన్న పలువురు అధికారులకు దొరకకుండా దర్జాగా బయట తిరుగుతూ చందనం దందా కొనసాగిస్తున్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుగుతుండగా, మరి కొందరు అధికారుల ఆశీస్సులతోనే నేరాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు వ్యాపార వేత్తలుగా చలామణి అవుతూ చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన నవాజ్‌బాషా అలియాస్ లిబర్టీ బాషా, వన్‌టౌన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమీర్, వల్లపు ఆదినారాయణ, ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన దస్తగిరి, ప్రాఫిట్‌వల్లి, కొండపల్లి మస్తాన్‌లతో పాటు చాలా మంది ఎర్రదొంగలు అటవీశాఖ అధికారులకు దొరకకుండా తిరుగుతున్నారు.

నవాజ్‌బాషా, మస్తాన్, దస్తగిరి తరచూ ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొందరు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. వీరికి నిత్యం అటవీశాఖలోని కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల కదలికలు, నాకా బంది ఎక్కడ చేస్తారు, ఏ రోజు చేస్తారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మగ్లర్‌లకు చేరవేస్తున్నారు.
   
 15 రోజుల్లో 20 మందిని పట్టుకుంటాం..
 కేసులు నమోదై తప్పించుకొని తిరుగుతున్న వారిని 15 రోజుల్లో పట్టుకుంటామని డిప్యూటి రేంజ్ అధికారి లక్ష్మీనరసయ్య న్యూస్‌లైన్‌తో అన్నారు. ఇప్పటికే 20 మందిని గుర్తించామన్నారు. మండ్ల సునీల్, రామనాథరెడ్డిలపై కేసులు ఉన్నట్లు ఇన్ని రోజుల నుంచి తనకు తెలియదని అన్నారు. వాళ్లిద్దరిని పీటీ వారెంట్‌పై తీసుకుని వచ్చి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement