పడకేసిన పర్యాటకం
మన్యంలో కానరాని టూరిజం ప్రగతి
అమలుకు నోచుకోని ప్రతిపాదనలు
పాడేరు: ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి రూపొందిం చిన ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా మన్యంలో పర్యాటక అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఏజెన్సీలోని డల్లాపలి, లమ్మసింగి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ రూ.14.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ పర్యాటకాభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టులను మం జూరు చేస్తూ ప్రభుత్వం గతేడాది జీవో జారీ చేసింది. డల్లాపల్లిలో రూ.6.5 కోట్లు వెచ్చించి 30 రిసార్ట్స్‌తోపాటు రెస్టారెంట్, వ్యూపాయింట్, స్విమ్మింగ్‌పూల్, కాన్ఫరెన్స్ హాల్, చింతపల్లి మండలంలోని లంబ సింగిలో రూ.8 కోట్లతో 40 రిసార్ట్స్, 2 రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్‌హాల్, ఆయుర్వేద హెల్త్ స్పా, ఓపెన్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, వ్యూపాయింట్ తదితర వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే నేటికీ మన్యంలో పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపుదాల్చలేదు.
డల్లాపల్లిలో బటర్‌ఫ్లై పార్కు నిర్మించాలనే ప్రతిపాదనను ఆదిలోనే విరమించారు. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడాది పొడవునా వివిధ రాష్ట్రాల నుంచి ఏజెన్సీకి పర్యాటకులు వస్తుం టారు. డల్లాపల్లి, లమ్మసిం గి ప్రాంతాలలో పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు సౌలభ్యం చేకూరడమే కాకుండా పర్యాటక ప్రాం తాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డల్లాపల్లి నుంచి లంబసింగి వెళ్లే మార్గ మధ్యంలోని కొత్తపల్లి జలపాతాన్ని మాత్రం వనబంధు కల్యాణ యోజన పథకం నిధులతో అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఏజెన్సీలో జలపాతాలు, ఇతర 150 పర్యాటక స్థలాలను గుర్తించి అధికారులు ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇవేవీ కార్యరూపం దాల్చడం లేదు.
గతేడాదిగా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మన్యంలోని పర్యాటక ప్రాజెక్టులు రూపుదాల్చక ముందే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి వద్ద రూ.192 కోట్లతో ఒక ప్రాజెక్టును చేపట్టేందుకు గత మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ దీన్‌పార్కు, వాటర్‌పార్కు, బోటింగ్, స్టార్ హోటల్ నిర్మాణానికి క్యేజిల్ హిల్స్ ప్రాజెక్టు లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోనే ఇది భారీ పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. మన్యంలో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన అరకు, అనంతగిరి పర్యాటక కేంద్రాలకు, విశాఖపట్నం, విజయనగరం జిల్లా కేంద్రాలకు చేరువగా ఉన్న తాటిపూడి లో భారీ పర్యాటక ప్రాజెక్టు చేపడుతుండటంతో ఏజెన్సీలో పర్యాటకాభివృద్ధిని ప్రభుత్వం వెనుక్కినెట్టే పరిస్థితి కనిపిస్తోంది. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాలో రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉందని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.