కావలి : కావలి కాలువ కింద సాగయ్యే ప్రతి ఎకరాకు సాగునీరు.. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా.. ప్రభుత్వం మెడలు వంచి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని భగీరథుడిలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోరుబాటకు సిద్ధమయ్యారు. గత నాలుగేళ్లుగా సాగునీరందక రైతుల పంటలు ఎండుతుంటే, తాగునీరందక ప్రజల గొంతెండుతుంది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అలుపెరగని ప్రయత్నాలు చేశారు.
ఎట్టకేలకు కలెక్టర్ జానకిని ఒప్పించి ప్రస్తుతం సాగులో ఉండి పంట చేతికందే దశలో ఉన్న పొలాలకు సాగునీరు రప్పించి భగీరథుడయ్యారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. కావలి కాలువ ఆధునికీకరణ, సంగం బ్యారేజీ వద్ద కావలి కాలువకు నీరు విడుదల చేసేందుకు ప్రత్యేక హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు చేయడంలో గత, ప్రస్తుత పాలకులు మీనమేషాలు వేస్తుండటంతో రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి వీటి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వంపై పోరాటానికి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్న ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా రైతులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.
సోమశిలో నీరున్నా..నిష్ర్పయోజనం
నియోజకవర్గానికి ప్రధాన నీటి వనరుగా కావలి కాలువ ఉంది. సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నా, కావలి కాలువ ఆయకట్టు రైతులు ప్రతి సీజన్‌లో సాగునీటి కష్టాలు పడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా 550 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. కాలువ కింద పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా కాలువ ఆధునికీకరణ జరగకపోవడంతో ఏటా సీజన్‌లో ఈ సమస్య తలెత్తుతోంది. సంగం బ్యారేజీ ఆధునికీకరణకు నోచుకోకపోవడంంతో బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో ఇసుక బస్తాలు వేస్తే తప్ప కనీసం 400 క్యూసెక్కుల నీరు పారడం లేదు. ప్రతి సీజన్‌లో బ్యారేజీ వద్ద ఇసుక బస్తాల ఏర్పాటుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా ఫలితం లేకుండా పోతుంది. ఈ ఏడు సోమశిలలో పుష్కలంగా నీరున్నా.. కేవలం సంగం బ్యారేజీ, కావలి కాలువ ఆధునికీకరణ జరగకపోవడం వల్లే ముందుగా ఐఏబీలో నిర్దేశించి మేరకు కూడా సాగునీటిని విడుదల చేయలేకపోయారు.
ఒక్క చెరువుకు రాని నీరు
కావలి కాలువ కింద నియోజకవర్గంలోని కావలి పట్టణం, రూరల్, దగదర్తి, బోగోలు మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం ఉంది. ఆయకట్టు కింద ఆయా ప్రాంతాల్లో 55 చెరువులు వరకు ఉన్నాయి. ఈ సీజన్‌లో జరిగిన ఐఏబీ సమావేశంలో కావలి కాలువ కింద సుమారు 75 వేల ఎకరాలకు 55 చెరువుల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక్క చెరువుకు నీటిని విడుదల చేయలేదు. కాలువ కింద కనీసం 29 వేల ఎకరాలకు కూడా సాగునీటిని అందివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు ఎంతో సాగునీటి ఇబ్బందులను పడాల్సి వచ్చింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రైతాంగం పడుతున్న సాగునీటి సమస్యను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఈ సమస్యను తీర్చాలని రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారుల చుట్టూ ఎన్నోసార్లు ప్రదక్షణలు చేశారు. అధికారులను ఒప్పించి కొన్ని ప్రాంతాలకు సాగునీటిని పారించారు.
దీక్షకు సంపూర్ణ మద్దతు : సాగునీరు, తాగునీటి కోసం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. రైతాంగం కోసం ఆయన నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలి.
- శివారెడ్డి, రైతు, గౌరవరం
రైతులకు అండగా రామిరెడ్డి దీక్ష : రైతులకు అండగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిరాహార దీక్షను చేస్తున్నారు. ఆయనకు అండగా దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. రైతుల కోసం పోరాడుతున్న నేత ఎమ్మెల్యే ఒక్కరే.
- వై. నరసయ్య, రైతు
మా పక్షాన ఎమ్మెల్యే దీక్ష : మా పక్షాన కావలి ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంత వరకు మా రైతుల సమస్య పరిష్కారానికి ఏ నాయకుడు, ఎమ్మెల్యేలు పోరాటానికి దిగలేదు. రైతులందరూ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే దీక్షకు మద్దతు తెలపాలి.
- పీ మాల్యాద్రి, రైతు
భగీరథుడి పోరుబాట
Published Thu, Feb 19 2015 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement