దాసన్నపేట మంచి నీటి కుళాయి వద్ద అదే పరిస్థితి (ఇన్‌సెట్‌లో) 36వ వార్డులో తాగునీటి కోసం వరుసలో ఉంచిన బిందె
విజయనగరం మున్సిపాలిటీ: విజయనగరం మున్సిపాలిటీ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఐదు నెలలుగా పానీ పాట్లు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా కోసం రూ.కోట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రజల వెతలు తీరడం లేదు. పాలకవర్గ ప్రతినిధుల పర్యవేక్షణ లేమి.. అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి వెరసి తాగునీటి సమస్య ప్రజలకు కఠిన పరీక్ష పెడుతోంది. దీంతో గత ఐదు నెలలుగా విజయనగరం ప్రజలు తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. తెల్లవారు లేచింది మొదలు ఉద్యోగాలు, ఇతర పనులు పక్కన పెట్టి క్యాన్‌లు పట్టుకుని మినరల్ వాటర్ ట్యాంక్‌ల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు తాగునీటి ఎద్దడి పట్టణంలో నివసిస్తున్న మూడు లక్షల మందిని కలవరపెడుతోంది.
ఇదీ పరిస్థితి...
అధికారిక లెక్కల ప్రకారం పట్టణంలో నివసిస్తున్న మొత్తం 3 లక్షల మంది జనాభాకు సక్రమంగా నీటిని సరఫరా చేయాలంటే 36 నుంచి 40 ఎంఎల్‌డీ అవసరం. ప్రస్తుతం నెల్లిమర్ల, రామతీర్థం రక్షిత మంచి నీటి పథకాలతో పాటు అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మరో ప్రాజె క్టు నుంచి రోజుకు 10 నుంచి 11 ఎంఎల్‌డీ నీరు మాత్రమే వస్తోంది. ఐదు నెలల కిందటి వరకు మున్సిపాలిటీలోని 24 వార్డు ప్రజలకు తాగునీరు సరఫరా చేసే ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకం నుంచి 10.23 ఎంఎల్‌డీ నీటి పంపింగ్ నిలిచిపోవడంతో విజయనగరం పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకం నుంచి కేవలం 3 ఎంఎల్‌డీ నీరు మాత్రమే పంపింగ్ అవుతోంది. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన మున్సిపల్ పాలకులు, అధికారులు నీళ్లు నములుతుండడంతో ఇప్పట్లో ఈ సమస్య తీరే పరిస్థితులు లేవన్న భయం అందరిలో నెలకొంది. సమస్యపై తక్షణమే స్పందించాల్సిన పాలకులు కేవలం సమీక్షలకు పరిమితమవుతుండగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్న అధికారులకు అడుగడుగునా ఆటం కాలు ఎదురవుతుండటంతో ఏమి చేయాలో పా లుపోలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకం నీటి పంపింగ్ కోసం రూకోట్లు వెచ్చించి నూతన మోటార్లు,జనరేటర్‌లు ఏర్పాటు చేయగా.... అప్ప టి వరకు వినియోగించిన పాత మోటార్లు లెక్కలోకి రాకుండా కాలగర్భంలోకి కలిసిపోయాయి.
నాలుగు రోజులకోసారి నీటి సరఫరా..
మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులతో గత ఐదు నెలలుగా నాలుగు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. çనెల రోజుల కిందట అధికార పార్టీ నేతలు వార్డుల్లో నిర్వహించిన జన్మభూమి– మాఊరు కార్యక్రమాల్లో తాగు నీటి సమస్యను పరిష్కరించామని, ఇకపై రోజు విడిచి రోజు నీటి çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హమీ బూటకంగానే మిగిలిపోయింది. మరికొన్ని ప్రాం తాలకు తాగునీరు సరఫరా కాకపోవడంతో ము న్సిపల్ అధికారులు పంపించే ట్యాంకర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్లకు పెరిగిన గిరాకీ
మున్సిపాలిటీ కుళాయిలకు తాగునీటి సరఫరా అంతంత మాత్రమే కావడంతో 20 లీటర్ల నీటి కోసం గంటల తరబడి క్యూలో నిల్చునే పరిస్థితి దాపురించింది. పలు ప్రాంతాల్లో ఆ నీరు లభ్యంకాక ప్రజలు వేరే ప్రాంతాలకు డ్రమ్ములు, కార్లు వంటి వాహనాలతో పట్టణంలో వెతుకులాడారు. ప్రత్యేకంగా 20 లీటర్ల క్యాన్‌లు తెప్పించి విక్రయించినా ఎటూ చాలని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు గమనిస్తే పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎంతటి బాధలు పడుతున్నారో చెప్పనక్కర్లేదు.
రూ. 3.20 కోట్లతోవేసవి కార్యాచరణ
విజయనగరం మున్సిపాలిటీలో ప్రస్తుతం 3 నుంచి 4 రోజులకోసారి రక్షిత మంచి నీరు సరఫరా చేస్తున్నాం. నెల్లిమర్ల, రామతీర్థం తాగునీటి పథకాలతో పాటు అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మరో ప్రాజెక్టు నుంచి రోజుకు 10 నుంచి 11 ఎంఎల్‌డీ నీరు మాత్రమే పంపింగ్ అవుతోంది. ముషిడిపల్లి నుంచి మరో 3 ఎంఎల్‌డీ వస్తుంది. ఆ నీటిని సర్దుబాటు చేస్తున్నాం. రానున్న వేసవిలో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ చర్యలపై చర్చిస్తున్నాం. రూ.3.20 కోట్లతో వేసవిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. గడిగెడ్డ నుంచి నీరు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడి నుంచి నీరు వస్తే సమస్యను కాస్త అధిగమించగలం.– ఎస్‌ఎస్ వర్మ, మున్సిపల్ కమిషనర్,ఇన్‌చార్జి ఆర్డీ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment