తాగునీటికి విజయనగరం వాసులు కటకట
విజయనగరం: హుదూద్ తుపానుతో విజయనగరం పట్టణ వాసులు కష్టాలు గురువారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో మంచినీరు అందిస్తామంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటన మాటలకే పరిమితమైంది. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఎక్కడా కనిపించలేదు. అలాగే మంచి నీటి సరఫరా లేక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని పలు కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి గ్రామాలకు తరలివెళ్లిపోతున్నారు. ఇన్వెర్టర్ల ఛార్జీంగ్ కోసం కిలోమీటర్ల మేర డీజిల్ ఇంజిన్ల వద్ద భారీ క్యూలు కట్టారు.
అపార్ట్మెంట్లలో చేరుకున్న నీటిని తోడేందుకు గంటకు రూ. 2 వేలు నుంచ రూ. 3 వేలు ఇంజిన్ యజమానులు తీసుకుంటున్నారని ఆపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. నగరంలో విద్యుత్ వ్యవస్థ ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో చాలా కాలనీలు అంధకారంలోనే ఉన్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఇంకా పునరుద్ధరణ కాలేదు. విజయనగరం నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అలాగే తుపాను దాటికి పంటలు పాడవడంతో కూరగాయల ధరలు ఆకాశానంటాయి.