డబ్బులిచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్
విశాఖ : హుదూద్ తుఫాను విలయ తాండవానికి విశాఖ జిల్లాలో చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. అరుకు, పాడేరు మార్గంలో పరిస్థితి భయానకంగా ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యల నిమిత్తం మంత్రులు, అధికారులు కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా లేక జనాలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. జనరేటర్ల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టించుకుంటున్నారు.
కాగా హుదూద్ తుఫాను ధాటికి సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అవటంతో గిరిజనులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మన్యంలో పలుచోట్ల సెల్ టవర్లు దెబ్బతినటంతో అయిదు రోజులుగా సెల్ఫోన్లు పనిచేయటం లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే విద్యుత్ సరఫరా లేదు. తమవారి క్షేమ సమాచారాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముంచంగిపుట్టులో పలువురు మోటార్ బైకుల ద్వారా సెల్ ఛార్జింగ్ చేసుకుంటున్నారు.