క‘న్నీళ్లు’ | Drinking Water Problems In YSR Kadapa | Sakshi
Sakshi News home page

క‘న్నీళ్లు’

Published Sun, Apr 28 2019 9:31 AM | Last Updated on Sun, Apr 28 2019 9:31 AM

Drinking Water Problems In YSR Kadapa - Sakshi

పల్లె గొంతెండుతోంది. నీళ్లో రామచంద్ర అంటూ జనం అలమటిస్తున్నారు. జిల్లాలో కరువు పర్యాయ పదంగా మారిన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతంలో పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో బహుదా, మాండవ్య, పాపాఘ్ని పరివాహకంలోని కొన్ని గ్రామాల్లోనైనా కాస్తో, కూస్తో తాగునీరు అందుబాటులో ఉండేది. సంవత్సర కాలంగా వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. వేయి అడుగులు తవ్వితేగానీ నీటి జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ రక్షిత తాగునీటి పథకాలు అన్నీ ఎండిపోయాయి.వ్యవసాయ బోరు బావులు బావురుమంటున్నాయి. ఇంతటి దుర్బర పరిస్థితులు తామెన్నడూ చూడలేదని శతాధిక వృద్ధులు పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా పనులు లేక వలసలు వెళ్లే వాళ్లం. ఇప్పుడు తాగేందుకు గుక్కెడు నీరు లేక ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని వారు చెబుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

కడప సెవెన్‌రోడ్స్‌ : సెప్టెంబరు అంటే మంచి వర్షాలు కురిసే మాసం. అలాంటిది గత ఏడాది సెప్టెంబరు నుంచి రాయచోటి నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు తాగునీరు రవాణా అవుతోంది. దీనిని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఏ పల్లెకు వెళ్లినా ప్రతి ఇంటిముందు ప్లాస్టిక్‌ డమ్ములు కనిపిస్తాయి. తాగునీరు రవాణా చేసే ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూసే దృశ్యాలు కనిపిస్తాయి. ట్యాంకర్‌ వచ్చిందంటే మహిళలు, పిల్లలు బిందెలతో ఎగబడుతున్నారు.ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి రైతు, వ్యవసాయ కూలీ పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. పంటలు గ్యారంటీ లేకపోయినా పాల విక్రయం ద్వారా కాస్తో కూస్తో ఆదాయం వస్తోంది.

అందుకే పశువుల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ డ్రమ్ములకు నీరు పట్టుకుంటున్నారు. బోర్లలో జలం అడుగంటుతుండటం వల్ల ట్రిప్పులు తగ్గిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రాజకీయ నాయకులు రోజూ ట్యాంకర్లు పంపించారని, పోలింగ్‌ ముగిశాక పట్టించుకోవడం లేదని చిన్నమండెం మండలం చాకిబండ, సంబేపల్లె మండలం శెట్టిపల్లె ప్రజలు ‘సాక్షి’కి తెలిపారు. తమ గ్రామంలో నాలుగైదు కుటుంబాలు కలిసి డబ్బులు వేసుకుని ట్యాంకర్లు తెప్పించుకోవాలనుకుంటున్నామని సంబేపల్లె మండలం పాపిరెడ్డిగారిపల్లె ప్రజలు తెలిపారు. ఆరు నెలలుగా తాగునీటి ట్యాంకరు వస్తోందని రాయచోటి మండల కంచరపల్లె కాలనీకి చెందిన కాల్వపల్లె వేమయ్య తెలిపారు.

అయితే కాలనీ అవసరాలకు నీరు సరిపోవడం లేదన్నారు. తమ గ్రామంలోని ప్రభుత్వ రక్షిత నీటి పథకం ఎండిపోయిందని గాలివీడు మండలం మలసానివాండ్లపల్లెకు చెందిన మల్లమ్మ చెప్పారు. వెలిగల్లు, కుషావతి ప్రాజెక్టులు ఉన్నా ఇక్కడి గ్రామాల్లో భూగర్భ జలం లేదని తెలిపారు. రోజుకు రెండు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా మనుషులు, పశువులకు సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఆరు మండలాల్లో 261 గ్రామాలకు రోజుకు 830 ట్రిప్పులు నీటి రవాణా చేస్తున్నట్లు శుక్రవారం నాటి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నివేదిక వెల్లడిస్తోంది. అలాగే 58 గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకుని నీరందిస్తున్నారు.

మండలాల వారీగా.....
చిన్నమండెం మండలంలో 44 గ్రామాలకు రోజుకు 123 ట్రిప్పుల నీటి రవాణా జరుగుతోంది. గాలివీడు మండలంలో 74 గ్రామాలకు 247 ట్రిప్పులు, లక్కిరెడ్డిపల్లె మండలంలో 56 గ్రామాలకు 172 ట్రిప్పులు, రామాపురం మండలంలోని 32 గ్రామాలకు 112 ట్రిప్పులు, సంబేపల్లె మండలంలోని ఐదు గ్రామాలకు 25 ట్రిప్పులు, సుండుపల్లె మండలంలోని 29 గ్రామాలకు 78 ట్రిప్పులు, వీరబల్లి మండలంలోని 13 గ్రామాలకు 29 ›ట్రిప్పులు నీరు రవాణా అవుతోంది. ఇవి కాకుండా వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి పట్టణంతోపాటు గాలివీడు మండలంలోని 12 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు.

ఆగిపోయిన బిల్లులు
తాగునీరు రవాణా చేస్తున్న ట్యాంకర్ల యజమానులకు గత సంవత్సరం సెప్టెంబరు నుంచి బిల్లులు చెల్లించలేదు. డీజిల్, డ్రైవర్‌ జీతం, ఇతర నిర్వహణ వ్యయాన్ని ఇక తాము భరించలేమని పలువురు ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. రాయచోటి మండలం దిగువ కంచరపల్లెకు చెందిన మంచింటి రాజారెడ్డి అనే ట్యాంకర్‌ యజమాని మాట్లాడుతూ తాను దిగువ కంచరపల్లె, కాలనీకి తాగునీరు రవాణా చేస్తున్నానని, సెప్టెంబరు నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. గాలివీడు మండలం కొత్త బండివాండ్లపల్లెకు చెందిన కె.లోకేష్‌రెడ్డి అనే ట్యాంకర్‌ యజమాని మాట్లాడుతూ తాను రోజుకు ఎనిమిది ట్రిప్పుల నీరు సరఫరా చేస్తున్నానని, సెప్టెంబరు నుంచి బిల్లులు నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఆర్‌ఎఫ్‌ కింద కోటి మూడు లక్షల రూపాయలు బిల్లులను ఫిబ్రవరి 17వ తేదీ ట్రెజరీకి పంపి టోకెన్‌ నంబర్లు కూడా తీసుకున్నారు. అయితే డబ్బులు మాత్రం రాలేదు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షక ఇంజినీరు తమ శాఖ ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే నాన్‌ సీఆర్‌ఎఫ్‌ కింద రెండు కోట్ల 20 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలకు దోచుపెట్టే నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించిన బిల్లులకు ఆగమేఘాల మీద నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం విచారకరమని పలువురు విమర్శిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం
మా గ్రామంలో సుమారు 300 ఇళ్లున్నాయి. నాలుగు బోర్లు ఉండగా, అందులో రెండు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన వాటిలో కొద్దిసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. వేయి అడుగుల లోతులోగానీ నీరు లభించడం లేదు. మా గ్రామానికి నాలుగు ట్యాంకర్ల నీరు సరఫరా చేస్తున్నా అవసరాలకు సరిపోవడం లేదు. – దేవరింటి సిద్దయ్య, చిన్నర్సుపల్లె, చిన్నమండెం మండలం

వారానికోసారి ట్యాంకర్‌ వస్తోంది
ఎన్నికలకు ముందు ప్రతిరోజు గ్రామానికి నీళ్ల ట్యాంకర్లు వచ్చేవి. ఇప్పుడు వారం, పది రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే బోర్లలో జలం లేదని ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. దీంతో తాము వ్యవసాయ బోరు బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నాము. అక్కడ కూడా కొద్దిసేపు వచ్చాక ఆగిపోతున్నాయి. – కుర్నూతల అంజనమ్మ, చాకిబండ గ్రామం, చిన్నమండెం మండలం

సమస్య పరిష్కరించాలి
మా గ్రామంలో బోర్లన్నీ ఎండిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ట్యాంకర్లు రోజుకు ఆరు ట్రిప్పులు తోలుతున్నాయి. మా గ్రామ పరిసరాల్లో నీరు లేకపోవడంతో ఆరు కిలోమీటర్ల దూరంలోని రామాపురం నుంచి నీరు వస్తోంది.సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – ఎన్‌.జగన్‌మోహన్‌రెడ్డి, అంబాబత్తినవారిపల్లె, చిన్నమండెం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement