రికార్డుల్లో పేరు.. కాలగర్భంలో ఊరు | 600 Villages Missing in Government Records in YSR Kadapa | Sakshi
Sakshi News home page

రికార్డుల్లో పేరు.. కాలగర్భంలో ఊరు

Published Thu, Aug 6 2020 10:30 AM | Last Updated on Thu, Aug 6 2020 10:30 AM

600 Villages Missing in Government Records in YSR Kadapa - Sakshi

పంచాయతీ కేంద్రంగా ఉన్న రాఘవరాజపురం

ఊరి పేరు గొప్పగా ఉంటుంది.. భూ రికార్డుల్లోనూ ఆ ‘పేరు’ వెలిగిపోతుంటుంది.. ఎవరైన  కొత్తవాళ్లు భూ రికార్డులు తిరగేస్తూ ‘ఓసారి ఆ ఊరెళ్లి చూసొద్దాం పదా’ అంటే తల పట్టుకోవాల్సిందే.. ఎందుకంటే భౌతికంగా ఆ ఊరే ఉండదు మరి.. అవును రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా భౌతికంగా కనిపించని గ్రామాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. నీటి వసతి లేక  కొన్ని.. ఉపాధి లేక ఇంకొన్ని.. పాలేగాళ్ల దాడులతో కొన్ని.. ఫ్యాక్షన్‌  గొడవలతో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. పేర్లు ఉన్నా..  ఊర్లు లేని గ్రామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి ప్రతినిధి కడప:జిల్లా వ్యాప్తంగా ఓ వెలుగు వెలిగిన గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితమే శిథిల శకలాలుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో బందిపోట్లు, దివిటి దొంగల వరుస దాడులతో తట్టుకోలేక అటవీ ప్రాంతాల శివారు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఊర్లు వదిలిపెట్టగా మరోవైపు పాలేగాళ్ల దాడులు, ఒత్తిళ్లతోనూ మరికొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. కలరా, ధూము లాంటి జబ్బులతో మృత్యువాతపడి వాటి నుంచి తప్పించుకునేందుకు సెంటిమెంటుగా ఖాళీ అయిన గ్రామాలు కొన్ని కాగా, సాగు, తాగునీరు అందక, వ్యవసాయం వీలుకాక ఉపాధిని వెతుక్కొంటూ ఖాళీ అయిన ఊర్లు మరికొన్ని. ఇక ఫ్యాక్షన్‌  గొడవలతో జనం ఖాళీ చేసిన ఊర్లు ఇంకొన్ని. మొత్తంగా 200 ఏళ్ల క్రితం వరకు వెలుగు వెలిగిన చాలామటుకు గ్రామాలు ఇప్పుడు భౌతికంగా కనుమరుగయ్యాయి. జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు తదితర ప్రాంతాలలో ఇలా కనుమరుగైన గ్రామాల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికీ ఆ గ్రామాల పేర్లతోనే పంచాయతీ కేంద్రాలు, రెవెన్యూ గ్రామాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ భూ రికార్డులు సైతం కనుమరుగైన గ్రామాల పేరుతోనే ఉండడం మరో విశేషం. 

వాసుదేవపురం గుర్తులు
రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం పంచాయతీ వాసుదేవపురం మాయమైనా రెవెన్యూ రికార్డులలో మాత్రం నిక్షిప్తమై ఉంది. రాఘవరాజపురం ప్రధాన రహదారి గంగరాజపురం మీదుగా ఒక కిలోమీటరు ప్రయాణిస్తే వాసుదేవపురం ఉండేది. 50 సంవత్సరాల క్రితం కొందరు గిరిజనులు ఇక్కడ నివాస ముంటుండేవారు. కాలానుగుణంగా వారు ఇతర ప్రాంతాలకు, చుట్టుపక్కల ఊర్లలోని వ్యవసాయ భూములలో కాపలా ఉంటూ నివాసాలు మార్చుకోవడంతో ఈ వాసుదేవపురం మరుగున పడిపోయింది.

గతంలో మా పూర్వీకులు ఉండేవారు
నాపేరు తుపాకుల గంగయ్య, నేను రాఘవరాజపురం రాజీవ్‌ గిరిజన కాలనీ, రైల్వేకోడూరులో నివాస ముంటున్నాను. మా బంధువుల పూర్వీకులు వాసుదేవ పురంలో నివాసముండేవారు. వారు అక్కడ దబ్బరగా ఉండే తోటలలో ఉంటూ పనులు చేసుకొంటూ జీవనం సాగించేవారు. దూరంగా ఉండడంవల్ల ఉపాధి కోసం అందరూ నివాససాలు మార్చుకొన్నారు. ఇంకా వాసుదేవపురం గుర్తుందంటే ఆనందంగా ఉంది.

తుగూట్ల పల్లికి సజీవ సాక్ష్యంగా నిలిచిన బురుజు
జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం పంచాయతీలో తూగుట్లపల్లి, గొరిగేనూరు పంచాయతీ పరిధిలో పాత కొండాపురం గ్రామాలు ఉండేవి. దోపిడీ దొంగల దాడులతో కాల క్రమేణ గ్రామాలు పూర్తిగా తుడుకు పెట్టుకుపోయాయి. గ్రామాలలో నివాసం ఉన్న వారందరూ వివిధ ప్రాంతాలలో స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ఇండ్లకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించకుండపోయాయి. దొంగల నుంచి కాపాడుకునేందుకు నిర్మించుకున్న బురుజులు, గంగమ్మ దేవాలయాలు నేటి తరానికి సాక్ష్యాలుగా నిలిచాయి.

కాల గర్భంలో కలిసిన గ్రామం
చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో దాదాపు 90 ఏళ్ల క్రితం రుద్రయ్యగారిపల్లి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలోని కుటుంబాలు అన్ని కలరా వ్యాధికి గురవ్వడంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలి చుట్టుపక్కల గల వివిధ గ్రామాల్లో చేరారు. అనంతరం తిరిగి గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకపోవడంతో అక్కడ ఉన్న కట్టడాలు, ఇళు, ఆనవాళ్లు కరుమరుగయ్యాయి. 

రికార్డులకు మాత్రమే పరిమితం   
వల్లూరు మండలంలో కోదండరామాపురం, ఓబన సోయయాజులపల్లె, అంకాయపల్లె, యాదవాపురం గ్రామాలు రెవెన్యూ గ్రామాలుగా పిలువబడుతూ రికార్డుల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు అగ్రహారాలుగా చలామణిలో వున్న ఈ గ్రామాలు కాల క్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల భూములు మాత్రమే రికార్డుల్లో మనకు కనిపిస్తాయి.

కవ్వపు చప్పుళ్ల మధ్య..
18వ శతాబ్దపు చివరలో దివిటి దొంగల దోపిడీతో అదృశ్యమైన పోయిన చాలా గ్రామాల్లో కాశినాయన మండలంలోని అక్కెంగుండ్ల ఒకటి. 13వ శతాబ్దం నుంచి ఉన్న గ్రామాల్లో చాలా పెద్దది. ఇది ఆకులనారాయణపల్లె సమీపంలో ఉన్న గుండోని కుంట పరిసరాల్లో ఉండేది. ఆనాడే రెండువేలకు పైగా గడపలు ఉన్న ఊరు. చుట్టూ ఎతైన రక్షణగోడ కట్టుకుని నాలుగువైపులా బురుజులు నిర్మించి, గ్రామ రక్షక దళం ఏర్పడి దోపిడి దొంగల నుంచి  తమను కాపాడుకునేవారు. పంటలు, ఆవులతో ఇంటింటా ఉండి పాడిపంటలతో సమృద్ధిగా ఉండేది. తెల్లవారుజామున ఊరంతా మజ్జిగ చిలికే సవ్వడులు చాలా దూరం వినిపించేవి. దోపిడీ దొంగలు ఎన్ని పర్యాయాలు దాడులు చేసినా వారి గుర్రాల కాలి గిట్టల చప్పుడుతో రక్షకదళం అప్రమత్తమై వడిసెల రాళ్లతో వారిని తరిమేవాళ్లు. ఎలాగైనా ఊరిని కొల్లగొట్టాలని దొంగలు యోచించి తెల్లవారుజామున మజ్జిగ కవ్వపు చప్పుల్లో ఉనికి పసిగట్టకుండా గుర్రాలతో వచ్చి ఊరిమీద దాడి చేసి మగాళ్లందరనీ ఊచకోత కోశారు. ఈ బీభత్సంతో ఆడవాళ్లంతా మాన రక్షణకు గ్రామంలో ఉన్న ఊరబావిలో దూకడంతో నిండుగా ఉన్న నీళ్లంతా పొంగిపోర్లాయని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఈ గ్రామం అనవాళ్లు కూడా లేవు.

సంచర్ల కథ
పోరుమామిళ్ల మండలంలోని సంచర్ల 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న గ్రామం. ఒకప్పుడు ఇక్కడ బ్రాహ్మణుల అధిపత్యం ఉన్న గ్రామం. వీరికి వందల ఎకరాలు మాన్యాలు కూడా ఉండేవి. చుట్టుపక్కల గంగిరెద్దుల వాళ్లు, యానాదులు వంటి సంచార జాతులు గ్రామంలో ఉండేవారు. వీరి పేరు మీద సంచారాల అని పేరు ఉండగా ఇది వాడుకలో సంచర్లగా మారింది. పక్కగ్రామంతో అధిపత్యపోరుతో బ్రాహ్మణులు వలస పోగా కొన్నాళ్ల తరువాత సంచార జాతులు కూడా ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో పది కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ పంచాయతీ పేరు సంచర్ల మీదనే ఉండగా పంచాయతీ కేంద్రం మాత్రం నాగలకుంట్లకు మారింది.

కత్తెరగండ్ల
ప్రస్తుత శ్రీ అవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల ఒక పురాతన గ్రామం. కృష్ణదేవరాయుల కాలంలో ఇక్కడ కుటీరపరిశ్రమలతో పాటు వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగేవి. నల్లమల కొండల్లోని ‘ఇనుపసరూట్ల’ వద్ద తీసిన ఇనుపఖనిజాన్ని ఎర్రబట్టిల గ్రామం వద్ద కాల్చి ఇనుము తయారు చేసి వ్యాపారం చేసేవారని, దీనికి కూడా ‘దారికాపు’(నేటి టోల్‌గేట్లు) పన్నులూ వసూలు చేశారని ఆధారాలున్నాయి. దాదాపు పదో శతాబ్దం కంటే ముందు నుంచే గ్రామమున్నట్లు చారిత్రకం. ఈ గ్రామం ఏ కారణంతో శిథిలమైందనే విషయానికి సరైన ఆధారాల్లేవు. ఊరు శిథిలమైనా పంచాయతీ పేరు మాత్రం కత్తెరగండ్లగా ఉంది. దీనికి పంచాయతీ కేంద్రంగా చెన్నవరం ఉంది. 13వ శతాబ్దంలో జనమేయ కాలంలో నిర్మించిన చెన్నకేశవ స్వామి పేరున చెన్నవరం ఏర్పడింది. 

భార్యాభర్తల పేరు మీద..
బద్వేలు మండలంలోని లక్ష్మిపాలెం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది. ఈ గ్రామానికి ఉన్న చరిత్ర చాలా గొప్పది. 400 ఏళ్ల కిందట సిద్ధవటంను పాలించే మట్టి అనంతరాజుల కాలంలో భర్త అనంతరాజు పేరు మీద అనంతరాజుపురం, భార్య లక్షుమ్మ పేరు మీద లక్ష్మిపాలెం ఏర్పాటు చేశారు. కాలక్రమేణా రికార్డుల్లో ఇప్పటికీ అనంతరాజుపురం అని ఉన్నా ప్రజల వాడుకలో లక్ష్మిపాలెంగా ఉంది. మట్లి రాజుల కాలంలో నిర్మించిన లక్ష్మివెంకటేశ్వర స్వామి గుడి, బద్వేలు పెద్దచెరువు ఆ గ్రామానికి గొప్ప చరిత్రను తెచ్చాయి.

కనిపించని టి.శేషంపల్లె
పోరుమామిళ్ల మండలం టి.శేషం పల్లె రెవెన్యూ గ్రామం ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నా గ్రామం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న దమ్మనపల్లె సమీపంలో ఉండేదని చరిత్ర. కొండ దిగువున ఉన్న ఈ ఊరు వరదలు, భారీ తుఫాన్లతో ఎప్పుడూ నష్టపోయేదని, దీంతో ఇక్కడ నివసిస్తున్న వడ్డెరలు, ముదిరాజ్‌ సామాజిక వర్గం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని పెద్దలు చెబుతున్నారు.

రంపాడు చరిత్ర
13వ శతాబ్దలో ఉన్న పెద్ద గ్రామాల్లో రంపాడు ఒకటి. కాశినాయన మండలంలో పారే సగిలేటి నది ఒడ్డున ఉండేది. అసలు పేరు ధర్మారం. దండుబాటల కారణంతో దోపిడీకి గురై గ్రామం చతికిలపడిపోయింది. గ్రామస్తులు చాలా ఏళ్లు తరువాత పునర్నిర్మింరించుకోవడంతో ధర్మారంపాడుగా మారింది. కాలక్రమేణా వాడుకలో రంపాడుగా మారింది. వ్యాధులు, దోపిడీ కారణంగా మళ్లీ దెబ్బతిని పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ప్రస్తుతం రంపాడు ఇప్పటికీ పంచాయతీ పేరుగా ఉండగా పంచాయతీ కేంద్రంగా పాపిరెడ్డిపల్లె మారింది.

బద్వేలు ప్రాంతంలో... 
నల్లమల కొండల పాదాల నుంచి సగిలేటి వరకు విస్తరించిన కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల ప్రాంతమంతా శిథిల గ్రామాల నేల. రెండు దశాబ్దాలలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైన విషాదగడ్డ. అవి చిన్న పల్లెలు అనుకుంటే పొరపాటు. రెవెన్యూ కార్యకలాపాలకు నిలయాలైన పెద్దగ్రామాలే. అలాంటి వాటిలో 24 గ్రామాలకు మజరాగ్రామంగా ఉన్న కత్తెరగండ్ల కూడా ఉంది. గ్రామం చుట్టూ రక్షణగోడ కట్టుకున్న అక్కెంగుండ్ల ఉంది.  సగిలేటి ఒడ్డున విరాజిల్లిన రంపాడు, పోరుమామిళ్ల మండలంలో సంచర్లతోపాటు పలు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆనవాళ్లు కనిపించకుండా చరిత్రలో మిగిలిపోయాయి

దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ
జిల్లాలో చాలామటుకు గ్రామాలు కనుమరుగయ్యాయి. 200 సంవత్సరాల క్రితం ఎక్కువ గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి. బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి కరువై మరికొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి.జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కేంద్రాలు, రెవెన్యూ గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది.     – తవ్వా ఓబుల్‌రెడ్డి, రచయిత, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement