463 ఖాళీలకు 91 మందే ఉన్నారు
స్మగ్లర్లను కాల్చివేయడానికి ఉత్తర్వులు కావాలి
టాస్క్‌ఫోర్సు డీఐజీ కాంతారావు
చిత్తూరు (అర్బన్): ‘‘నేను రాకమునుపు ఇక్కడ (తిరుపతిలో) ఏఆర్ డీఎస్పీ పనిచేస్తున్నారు. అలాంటి పోస్టుకు డీఐజీ స్థాయిలో ఉన్న నన్ను నియమించారు. రాయలసీమతో పాటు మొత్తం ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత టాస్క్‌ఫోర్సుపై ఉంది. మొత్తం 463 పోస్టులు మంజూరయితే ఇప్పటివరకు 91 మందినే కేటాయిం చారు. అయినా సరే మా పనిచేసుకుపోతున్నాం...’’ అంటూ ఎర్రచందన అక్రమ నివారణకు నియమించిన టాస్క్‌ఫోర్సు డీఐజీ కాంతారావు తీవ్ర అంసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరుకు వచ్చిన ఆయన స్థానిక అటవీశాఖ డీఎఫ్‌వో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సుకు కావాల్సిన సిబ్బంది కేటాయించకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదన్నారు.
గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు ఏఆర్ డీఎస్పీ పర్యవేక్షించిన స్థానాన్ని ప్రస్తుతం డీఐజీ స్థాయితో భర్తీ చేయడం, దీనికి ఆరు జిల్లాలను అప్పగించి సరైన సిబ్బంది నియామకం చేపట్టలేదన్నారు. ప్రస్తుతం 75 మంది పోలీసులు, 16 మంది అటవీశాఖ సిబ్బందితో టాస్క్‌ఫోర్సు పనిచేస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో కూడా స్మగ్లర్ల అణచివేతను తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అసోం రాష్ట్రంలో స్మగ్లర్లు పోలీసులపై తిరగబడితే కాల్చేసే అధికారం ఉందని, దీనిపై ఎలాంటి కేసు కూడా ఉండదన్నారు. ఈ తరహా అనుమతి కోసం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసి అక్కడి నుంచి సమాధానం కోసం నిరీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంటి దొంగల జాబితా ప్రభుత్వానికి
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరించిన అధికారుల జాబితాను ప్రభుత్వానికి పంపామని టాస్క్‌ఫోర్సు డీఐజీ కాంతారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి, కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. బుధవారం చిత్తూరుకు వచ్చిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. అటవీశాఖ కార్యాలయంలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ దాదాపు ఏడువేల వాహనాలను ప్రిన్స్‌పల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆధ్వర్యంలో విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
జిల్లాలో ఎర్రచంనం స్మగ్లర్ల గురించి, దుంగలు నిల్వ ఉంచిన ప్రాంతాల గురించి సమాచారమిస్తే రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 9440796706, 7893331343, 0877-2284000లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎర్రచందనం రవాణాను నిలువరించేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖలు రాశామన్నారు. శేషాచల అడవుల్లో ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు కూంబింగ్ పార్టీలు 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. ఈ సమావేశంలో రేంజర్లు హేమచంద్రారెడ్డి, ప్రతాప్‌లాల్, కాటమరాజు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ స్థానంలో డీఐజీని ఉంచారు..!
Published Thu, Apr 2 2015 1:58 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement
Advertisement